నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానంలో తెరాస బహిరంగ సభ జరిగింది. లోక్‌సభ నియోజక వర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి వచ్చిన తెరాస శ్రేణులు, ప్రజలు కార్యకర్తలతో సభా పరిసరాలు మొత్తం గులాబీమయం అయ్యాయి. సాయంత్రం 7 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్న కేసీఆర్ వివిధ అంశాలపై దాదాపు 40 నిమిషాలపాటు ప్రసంగించారు.
రైతుల సమస్యలు పరిష్కరిస్తాం..
శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టులు తెలంగాణకు ఆయువుపట్టుగా ఉండేవని... ఆంధ్ర పాలకుల నిర్లక్ష్యం కారణంగా నిరూపయోగ దశకు చేరుకున్నాయన్నారు కేసీఆర్. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వద్దే.. మలిదశ తెలంగాణ ఉద్యమం గురించి ఆలోచన చేసినట్లు గుర్తు చేశారు. తెరాస ఆవిర్భావం తర్వాత నిజామాబాద్ నుంచే తొలి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని కట్టబెట్టారని చెప్పుకొచ్చారు. ఎర్రజొన్న, పసుపు రైతుల సమస్యలు పరిష్కరిస్తామని గులాబీ బాస్ హామీ ఇచ్చారు. అయితే ఇతరుల మాటలు విని ఇబ్బందులు పడొద్దన్నారు. ఎన్నికల వేళ నేరుగా ప్రకటన చేయలేమని... జిల్లా ప్రజాప్రతినిధులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ప్రత్యామ్నాయ పార్టీలు కావాలి
జాతీయ రాజకీయాలపై తనదైన శైలిలో కేసీఆర్ మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన స్ఫూర్తితోనే దేశ రాజకీయ పరిస్థితులు మారుస్తామన్నారు. 70 ఏళ్ల పాలనలో కనీస సౌకర్యాలు లేకపోవడం దారుణమన్నారు. సరైన జల, విద్యుత్ పాలసీలు లేవని విమర్శించారు. కాంగ్రెస్, భాజపాలు అధికారంలోకి వచ్చినప్పుడల్లా పేర్లు మార్చడం తప్ప కొత్త పథకాలు తేలేదన్నారు. చిన్న చిన్న దేశాలు ముందుకు వెళ్తుంటే.. అన్ని అవకాశాలు, వనరులు ఉండి మనదేశం ఇంకా అభివృద్ధి చెందుతూనే ఉండడం బాధాకరమని పేర్కొన్నారు. దేశాభివృద్ధిపై సరైన దృక్పథం లేదని.. ఇందుకు ప్రత్యామ్నాయ పార్టీల అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఎర్రజొన్న, పసుపు రైతులకు త్వరలోనే న్యాయం చేస్తామని ఎంపీ కవిత హామీ ఇచ్చారు. రైతుల సమస్యలు పరిష్కారమవుతాయంటే మోదీ నియోజక వర్గం వారణాసి, రాహుల్ గాంధీ నియోజక వర్గం అమేథిలో కూడా వెయ్యి మంది నిజామాబాద్ రైతులు నామినేషన్ వెయ్యాలని సూచించారు. మద్దతు ధర లభించేలా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని కవిత తెలిపారు.
భాజపాపై ధ్వజం
భాజపాపై కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రామ జన్మభూమి వివాదంపై వైఖరేంటి అని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అడిగిన అంశంపై ఘాటుగా స్పందించారు. అయోధ్య పంచాయితీలు పార్టీల పని కాదని.. స్వామిజీలు చూసుకుంటారన్నారు. రామ జన్మభూమి అంశం సుప్రీం కోర్టులో నడుస్తోందని తెలిపారు. భాజపా రాజకీయ పార్టీయా లేక మతతత్వ పార్టీనా చెప్పాలని లక్ష్మణ్‌ను అడిగారు. ఇతర మతాలను తిట్టినవారే హిందువులా అని ప్రశ్నించారు. లక్ష్మణ్‌ను డూప్లికేట్ హిందువని వ్యాఖ్యానించిన కేసీఆర్... ఇకనైనా ఓట్ల రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు.
అత్యధిక జనసమీకరణ ఉన్న నిజామాబాద్ సభలో రేపు తెరాస లోక్‌సభ అభ్యర్థులను ప్రకటిస్తున్నట్లు గులాబీ బాస్ పేర్కొన్నారు.
ఇవీ చూడండి:సోషల్ మీడియాలో తిడుతున్నరు:కేసీఆర్