అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ ఈ నెలాఖరులో భారత్ సందర్శనకు రావడం దౌత్యపరంగా విశేషమైన పరిణామమే అయినా ఆర్థికంగా మాత్రం కొత్త ఒత్తిళ్లు ఎదురు కానున్నాయి. ఈ యాత్ర సందర్భంగా భారత్, అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేటప్పుడు భారతీయ అధికారులు ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. తమ ఎగుమతులపై సుంకాలు బాగా తగ్గించాలని, రాయితీలు ఇవ్వాలని ట్రంప్ ఒత్తిడి తెస్తున్నారు. హార్లే డేవిడ్సన్ మోటారు సైకిళ్లపై భారత్ చాలా ఎక్కువ సుంకాలు విధిస్తోందని ఆయన గతంలో విమర్శించారు. భారత్‌ను టారిఫ్ (సుంకాల) రాజాగా వర్ణించారు. తన పర్యటనలో భారీ రాయితీల కోసం ఆయన డిమాండ్ చేయడం ఖాయమని చెప్పవచ్ఛు వాణిజ్యం, టారిఫ్‌ల మీద కుదుర్చుకున్న సాధారణ ఒప్పందం(గాట్)పై సంతకం చేసిన దేశాలు సాటి సభ్య దేశానికి ఏవైనా రాయితీలిస్తే, అవే రాయితీలను మిగిలిన సభ్యులకూ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ట్రంప్ ఒత్తిడికి తలొగ్గి అమెరికాకు ఇచ్చే రాయితీలను ఇతరులకూ వర్తింపజేయాల్సి ఉంటుంది. గాట్ అనే బహుళపక్ష ఒప్పంద పరిధిలో ద్వైపాక్షిక ఒప్పందాలకు తావు లేదు. దీనికింద ఏ దేశాలకైతే అత్యంత అభిమానపాత్ర దేశాలు (ఎంఎఫ్‌ఎన్) హోదా ఇచ్చామో వాటన్నింటికీ ఒకే విధంగా రాయితీలివ్వాలని దిల్లీకి చెందిన వాణిజ్య నిపుణుడు అజయ్ దువా అభిప్రాయపడ్డారు. పలు దేశాలకు ఎంఎఫ్‌ఎన్ హోదా ఇవ్వడం ద్వారా బహుళపక్ష వాణిజ్యాన్ని ప్రోత్సహించాలని గాట్ ఉద్దేశిస్తోంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిశాక ప్రపంచం ఆర్థికంగా చితికిపోయింది. దాన్ని మళ్లీ గాడిలో పెట్టడానికి 1947 అక్టోబరులో 23 దేశాలు గాట్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. తరవాత ఈ దేశాల సంఖ్య 123కు పెరిగింది. 1995లో గాట్ వారసత్వం డబ్ల్యూటీఓకు సంక్రమించి 90 శాతం ప్రపంచ వాణిజ్యం ఆ సంస్థ పరిధిలోకి వచ్చింది. ప్రస్తుతం ఈ సంస్థలో 164 సభ్యదేశాలు, 23 పరిశీలక దేశాలు ఉన్నాయి. డబ్ల్యూటీఓ సభ్య దేశాలన్నీ పరస్పరం ఎంఎఫ్‌ఎన్ హోదా ఇచ్చుకోవలసిందే.
డబ్ల్యూటీఓ వస్తు వ్యాపార మండలి గాట్ సంబంధ అంశాలను పర్యవేక్షిస్తుంది. వ్యవసాయం, సబ్సిడీలు, మార్కెట్‌లో ప్రవేశం కల్పించడం వంటి అంశాలపై 10 కీలక బృందాలు ఈ మండలి ఛత్రం కింద పనిచేస్తాయి. భారతదేశానికి ఆపిల్, బాదం, అక్రోట్, పాల ఎగుమతులను పెంచాలని అమెరికా ఆరాటపడుతోంది. అలాగే తమ దేశంలో గుట్టలుగా పేరుకుపోయిన కోడి కాళ్లనూ మనకు అంటగట్టాలని చూస్తోంది. 2017లో డబ్ల్యూటీఓ ఒత్తిడి వల్ల కోడి కాళ్ల దిగుమతికి భారత్ అంగీకరించక తప్పలేదు. పాడి, కోడి కాళ్ల దిగుమతికి గేట్లు ఎత్తితే భారతీయ రైతులు, కోళ్ల పెంపకందారులు విపరీతంగా నష్టపోతారు. ఈ రెండు పరిశ్రమల్లో లక్షలమంది జీవనోపాధికీ ఎసరు వస్తుంది.