తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సంక్షేమ తెలంగాణ: పథకాలతో ప్రగతిపథం - SCHEMES

పోరాడి సాధించుకున్న తెలంగాణ... సవాళ్లతో స్వాగతం పలికింది. ఉద్యమ సారథే... పాలన పగ్గాలను చేపట్టి సవాళ్లను... అధిగమించి అద్భుతమైన ప్రగతిని సాధించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు... రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా చేశాయి. ఇప్పుడు రెండోసారి అధికారం చేపట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్... రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నారు.

సంక్షేమ తెలంగాణ

By

Published : Jun 2, 2019, 6:03 AM IST

Updated : Jun 2, 2019, 7:08 AM IST

సంక్షేమ తెలంగాణ

నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ఏర్పడిన తెలంగాణ ఈ ఐదేళ్లలో గణనీయమైన ప్రగతి సాధించింది. సంక్షేమ పథకాల అమలులో దేశానికే ఆదర్శంగా నిలిచింది. పాలనలో తనదైన ముద్ర వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్... అభివృద్ధి, సంక్షేమాన్ని జోడుగుర్రాలుగా పాలనను పరుగులు పెట్టించారు. సంస్కరణలు తీసుకువచ్చి... రాష్ట్ర వృద్ధి రేటును రెండంకెలకు తీసుకెళ్లారు. ఐదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచింది. గురువారం విడుదల చేసిన ఆర్థిక ప్రగతి నివేదిక ఇవే అంశాల్ని స్పష్టం చేసింది. ముందస్తు ఎన్నికల్లో ఘనవిజయం సాధించి మరోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకున్న తెరాస ప్రభుత్వం... రెండో దఫాలో మరింత మెరుగైన పాలన అందించే దిశగా ముందుకెళ్తోంది.

ఉద్యమకారుడే ముఖ్యమంత్రి

2014 జూన్ 2... 45 ఏళ్ల తెలంగాణ ప్రజల కల సాకారమైన రోజు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణస్వీకారం చేసిన రోజూ అదే. రాష్ట్రం ఏర్పడితే విద్యుత్​ ఉండదని సమైక్య రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి హెచ్చరించిన ఆ సందర్భంలో బాధ్యతలు స్వీకరించిన గులాబీ దళపతి... సవాళ్లను అధిగమించారు. ఉద్యమకారుడే ముఖ్యమంత్రి అయి... పాలనలోనూ అదే స్ఫూర్తిని చూపించారు. ఇంటికే కాదూ... వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత కరెంట్ ఇస్తూ... యావత్ దేశాన్ని విస్మయానికి గురిచేశారు. సవాళ్లను అధిగమించడం అంటే ఏంటో చేసి చూపించారు.

స్ఫూర్తిగా తీసుకున్న మోదీ, ఇతర రాష్ట్రాలు

సాగుకు ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందించడం చరిత్రాత్మకం. ఎన్నికల ప్రణాళికలో పెట్టని ఎన్నో ప్రజోపయోగకరమైన పథకాలకు పురుడు పోశారు కేసీఆర్. ఎకరానికి రూ.4 వేల చొప్పున రెండు పంటలకు ఏటా 8 వేల పెట్టుబడి సాయం కింద ప్రతీ రైతుకు ఇచ్చే బృహత్తరమైన రైతు బంధు పథకాన్ని ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సాయాన్ని పెంచుతూ... ఎకరాకు 5 వేల చొప్పున రెండు పంటలకు 10 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ పథకాన్ని కేంద్రంతో పాటు, ఇతర రాష్ట్రాలు స్ఫూర్తిగా తీసుకున్నాయి. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్​ నిధి పేరుతో ఎకరాకు 6 వేల చొప్పున ఇస్తానని లోక్​సభ ఎన్నికల ప్రచారంలో మోదీ సైతం చెప్పారు.

సంక్షేమ కార్యక్రమాలు

అతి తక్కువ సమయంలో దేశంలో మరెవ్వరూ చేయలేనన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారు​. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో పాటు ఒంటరి మహిళలకు, బీడీ కార్మికులకు, గీత, చేనేత కార్మికులకూ ఆసరా పింఛన్ పథకం సాయం అందించారు. రూ.1000 ఉన్న పింఛన్​ను రూ.2016కు, దివ్యాంగులకు రూ.1500 నుంచి రూ.3016కు పెంచుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది కేసీఆర్ సర్కార్. ఇంకా ఎన్నో సరికొత్త పథకాలతో తెలంగాణ అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తోంది.

ఇవీ చూడండి: అంబులెన్స్​కు దారిచ్చిన గవర్నర్​ నరసింహన్​

Last Updated : Jun 2, 2019, 7:08 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details