తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సీతారామ నామస్మరణతో పులకించిన ఒంటిమిట్ట - seetarama kalyanam

చల్లని రాత్రిలో... నిండు చంద్రుడు వీక్షిస్తుండగా శ్రీరాముడి కల్యాణం వైభవోపేతంగా జరిగింది. కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరాముడి ఆలయం సీతారామస్వామి నామస్మరణతో పులకించింది. లక్షలాది భక్తుల సమక్షంలో సీతారాములు కల్యాణం కనులపండువగా జరిగింది. స్వామివారి కల్యాణానికి గవర్నర్ నరసింహన్ దంపతులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు హాజరయ్యారు. ప్రభుత్వం తరఫున చంద్రబాబు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు.

సీతారామ స్వామి

By

Published : Apr 19, 2019, 7:11 AM IST

Updated : Apr 19, 2019, 12:39 PM IST

ఒంటిమిట్ట కోదండరాముడి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు శాస్త్రోక్తంగా, మంత్రోచ్ఛరణల మధ్య సీతారాముల కల్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కల్యాణం తిలకించడానికి వేల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు శ్రీ సీతారాముల కల్యాణం జరిగింది. అంతకుముందు ఉత్సవ మూర్తులను ఆలయం నుంచి కల్యాణ వేదిక వరకు పల్లకిలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. కల్యాణ వేదిక వద్ద సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం జరిగింది.

సీతారామ నామస్మరణతో పులకించిన ఒంటిమిట్ట

పట్టు వస్త్రాలు సమర్పించిన చంద్రబాబు...
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు స్వామివారిని దర్శించుకుని... కల్యాణ వేదిక వద్దకు చేరుకున్నారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు స్వామివారికి సమర్పించారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దంపతులు ఆలయంలో స్వామివారిని దర్శించుకొని కల్యాణ వేదిక వద్దకు వచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ పక్కపక్కనే కూర్చుని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు. ఇద్దరూ నవ్వుతూ కుశలప్రశ్నలు వేసుకున్నారు.

సీతారాములను ఒక్కటి చేసిన తితిదే వేద పండితులు...
స్వామివారి కల్యాణాన్ని తితిదే వేద పండితులు రాజేశ్​కుమార్ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. రెండు గంటల పాటు స్వామివారి కల్యాణ మహోత్సవ క్రతువును జరిపించారు. రాత్రి 9.30 గంటల సమయంలో శ్రీరాముడు, సీతమ్మ తలపై జీలకర్ర బెల్లం పెట్టి కల్యాణ మూహూర్తం గడియ వచ్చినట్లు భావించి... మాంగల్యధారణ చేశారు. అనంతరం ముత్యాల తలంబ్రాలు వేసుకుని... దండలు మార్చుకున్నారు. స్వామివారి కల్యాణాన్ని ప్రత్యక్షంగా వీక్షించడానికి దాదాపు లక్ష మంది భక్తులు హాజరయ్యారని అధికారులు అంచనా వేశారు.

భక్తుల సంతృప్తి...
సీతారాముల కల్యాణ మహోత్సవం ఎలాంటి ఆటంకం లేకుండా... ప్రశాంతంగా ముగియడంపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాట్లపై సంతృప్తి చెందారు. భక్తులందరికీ తితిదే ముత్యాల తలంబ్రాల ప్యాకెట్లు అందజేశారు. గవర్నర్ నరసింహన్ దంపతులు, ముఖ్యమంత్రి చంద్రబాబు దంపతులు కడపలోనే రాత్రి బస చేశారు.

ఇవీ చూడండి: మొన్న కమలం.. నిన్న హస్తం.. నేడు సైకిల్​

Last Updated : Apr 19, 2019, 12:39 PM IST

ABOUT THE AUTHOR

...view details