సీజేఐపై 'కుట్ర' మూలాలు తేల్చుతాం: సుప్రీం భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయిపై లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక కుట్ర కోణంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. సీజేఐకు వ్యతిరేకంగా చాలా పెద్ద కుట్ర దాగుందన్న న్యాయవాది ఉత్సవ్ బెయిన్స్ అఫిడవిట్‌పై వాదనలు ఆలకించింది. కుట్ర విషయంలో బలం చేకూర్చే ఆధారాలు మరిన్ని ఉన్నాయని న్యాయవాది ఉత్సవ్ బెయిన్స్ నివేదించారు. ఆ ఆధారాలతో గురువారం మరో అఫిడవిట్ దాఖలు చేయాలని సుప్రీం ఆదేశించింది.
సుప్రీం మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణలపైనా సమాంతర విచారణ చేపట్టాలని న్యాయవాది ఇందిరా జైసింగ్ కోరారు. ఈ అభ్యర్థనను తోసిపుచ్చిన న్యాయస్థానం.. రెండు కేసులకు సంబంధం లేదని స్పష్టంచేసింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది.
"న్యాయవ్యవస్థను అస్థిరపరిచే కుట్ర జరుగుతోంది. న్యాయవాది బెయిన్స్ అఫిడవిట్‌పైనే ప్రస్తుతం విచారణ చేస్తున్నాం. న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి దెబ్బతీసే ఆరోపణలు తీవ్రమైనవి.అందుకే అఫిడవిట్‌లోని ఆరోపణలపై విచారణ చేస్తున్నాం. బెయిన్స్ ఆరోపణలు నిజమైతే న్యాయవ్యవస్థకు పెను ప్రమాదం ఉంది. ఈ కుట్రకు ఎవరు పాల్పడ్డారు, మూలాలు ఎక్కడున్నాయో కనుక్కుంటాం. లేదంటే న్యాయవ్యవస్థ విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది."
- సుప్రీం ప్రత్యేక ధర్మాసనం
సీజేఐపై ఆరోపణల వ్యవహారంలో సీబీఐ డైరెక్టర్, దిల్లీ పోలీస్ కమిషనర్, నిఘా విభాగం సంచాలకుడు అత్యవసరంగా తమను కలవాలని ప్రత్యేక ధర్మాసనం ఉదయం ఆదేశించింది. వారితో సమావేశమైన అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ చేపట్టింది.