తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'దావాల దాఖలుకు మళ్లీ పాత గడువే'

దావాల దాఖలుకు పాత గడువునే పాటించాలని సుప్రీంకోర్టు(Supreme Court news) తెలిపింది. 90 రోజుల్లోగా దావాలు వేయాలన్న నిబంధన అక్టోబరు 1 నుంచి తిరిగి అమల్లోకి రానుంది. దీనిపై ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ(CJI NV Ramana latest news) నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.

Supreme Court
సుప్రీంకోర్టు

By

Published : Sep 24, 2021, 7:07 AM IST

Updated : Sep 24, 2021, 7:45 AM IST

కరోనా పరిస్థితులు తగ్గుముఖం పడుతున్న దృష్ట్యా కేసుల దాఖలుకు పాత గడువునే పాటించాలని గురువారం.. సుప్రీంకోర్టు(Supreme Court news) తెలిపింది. ఏదైనా విషయమై 90 రోజుల్లోగా దావాలు వేయాలన్న గడువు ఉంది. అక్టోబరు ఒకటో తేదీ నుంచి తిరిగి ఆ నిబంధనే అమల్లోకి రానుంది. దీనిపై ఉత్తర్వులు ఇస్తామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ(CJI NV Ramana latest news), జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. కరోనా నేపథ్యంలో దావాలు వేయడానికి గడువును పెంచుతూ ఏప్రిల్‌ 27న సుమోటోగా ఉత్తర్వులు ఇచ్చామని, దాన్ని వెనక్కి తీసుకుంటామని పేర్కొంది. 2020 మార్చి 15 నుంచి వర్తించేలా దావాల సమర్పణ గడువు పెంచుతున్నట్టు నాటి ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికల పిటిషన్లకూ దీన్ని వర్తింపజేసింది. కరోనా మూడో ఉద్ధృతి వస్తుందన్న వార్తల నేపథ్యంలో గడువును ఏడాది చివరి వరకు పెంచాలని ఒకరు కోరగా "మీరు నిరాశావాదంతో ఉన్నారు. దయచేసి మూడో ఉద్ధృతిని ఆహ్వానించవద్దు" అని జస్టిస్‌ రమణ అన్నారు.

తొలుత అటార్నీ జనరల్‌ కె.కె.వేణుగోపాల్‌ మాట్లాడుతూ కొవిడ్‌ పరిస్థితులు అదుపులోకి వచ్చాయని, గడువును పెంచుతూ ఇచ్చిన ఉత్తర్వును ఉపసంహరించాలని కోరారు. ఎన్నికల సంఘం తరఫున సీనియర్‌ న్యాయవాది వికాస్‌ సింగ్‌ వాదనలు వినిపిస్తూ గడువు పెంచడం వల్ల ఎన్నికల పిటిషన్లు ఆలస్యంగా వస్తున్నాయని తెలిపారు. వాటికోసం ఈవీఎం, వీవీపాట్‌ యంత్రాలను కదిలించకుండా ఉంచాల్సి వస్తోందని చెప్పారు. అందువల్ల వీటిని వేరే ఎన్నికల కోసం ఉపయోగించే అవకాశం ఉండడం లేదని, ఇది సమస్యలకు దారి తీస్తోందని తెలిపారు. ఎన్నికలకు సంబంధించినంతవరకు గడువును 90 రోజుల నుంచి 45 రోజులకు కుదించాలని కోరారు. ఎన్నికల కేసులకు మినహాయింపు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలని అటార్నీ జనరల్‌ కోరారు. అలా చేస్తే దానిపై మళ్లీ కేసులు వస్తాయని జస్టిస్‌ రమణ వ్యాఖ్యానించారు. తీర్పును వాయిదా వేశారు.

ప్రత్యక్ష విచారణకు వచ్చేలా చూడండి

న్యాయవాదులు ప్రత్యక్ష విచారణకు హాజరయ్యేలా ప్రోత్సహించాలని ఇదే ధర్మాసనం సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌కు సూచించింది. కరోనా దృష్ట్యా ఇచ్చిన మార్గదర్శకాల కారణంగా చాలామంది కోర్టుకు రాలేకపోతున్నారని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వికాస్‌ సింగ్‌ చెప్పగా, వాటిని సవరిస్తామని తెలిపింది. ప్రత్యక్ష, వర్చువల్‌ విధానాల్లో ఏదో ఒక దాన్ని ఎంచుకోవచ్చన్న సౌలభ్యాన్ని న్యాయవాదులకు ఇవ్వకూడదని అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డు అసోసియేషన్‌ అధ్యక్షుడు శివాజీ జాదవ్‌ సూచించారు.

ఇదీ చూడండి:కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం- సుప్రీంకోర్టు ప్రశంసలు

Last Updated : Sep 24, 2021, 7:45 AM IST

ABOUT THE AUTHOR

...view details