తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సీజేఐపై 'కుట్ర' కోణం విచారణకు ప్రత్యేక కమిటీ - A K Patnaik

లైంగిక వేధింపుల ఆరోపణల విషయంలో సీజేఐపై అతి పెద్ద కుట్ర జరుగుతోందన్న న్యాయవాది బెయిన్స్‌ అఫిడవిట్‌పై విశ్రాంత న్యాయమూర్తితో విచారణకు సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ ఏకే పట్నాయక్‌కు బాధ్యతలు అప్పగించిన న్యాయస్థానం సీల్డ్ కవర్‌లో నివేదిక సమర్పించాలని సూచించింది.

'నిప్పుతో చెలగాటమా..? ఇక చాలు'

By

Published : Apr 25, 2019, 12:07 PM IST

Updated : Apr 25, 2019, 4:54 PM IST

సీజేఐపై 'కుట్ర' కోణం విచారణకు ప్రత్యేక కమిటీ

భారత ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక కుట్ర వ్యవహారంపై సుప్రీం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే పట్నాయక్‌ విచారణ చేస్తారని సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం స్పష్టంచేసింది. ఈ కమిటీలో జస్టిస్​ పట్నాయక్​ను మాత్రమే నియమించింది. విచారణలో జస్టిస్ పట్నాయక్‌కు సాయపడాలని సీబీఐ, నిఘా విభాగం, దిల్లీ పోలీస్ కమిషనర్‌ను ధర్మాసనం ఆదేశించింది.

ప్రధాన న్యాయమూర్తిపై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి పెద్ద కుట్ర జరుగుతోందన్న న్యాయవాది బెయిన్స్​ అఫిడవిట్​పై విచారణ చేసిన సర్వోన్నత న్యాయస్థానం ఈ మేరకు నిర్ణయం ప్రకటించింది.

బెయిన్స్​ అఫిడవిట్‌లోని అంశాలపై జస్టిస్‌ ఏకే పట్నాయక్‌ విచారణ జరిపి త్వరలో సుప్రీంకోర్టుకు సీల్డ్​ కవర్లో నివేదిక అందించనున్నారు.

సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్‌ గొగొయిపై మాజీ ఉద్యోగిని చేసిన ఆరోపణల అంశానికి, ఈ విచారణకు సంబంధం లేదని ప్రత్యేక ధర్మాసనం స్పష్టం చేసింది. జస్టిస్​ పట్నాయక్​ విచారణ ఫలితం సీజేఐపై వచ్చిన ఆరోపణలపై జరుగుతోన్న అంతర్గత విచారణపై ప్రభావం చూపబోదని తేల్చిచెప్పింది.

ఇదీ నేపథ్యం...

జస్టిస్​ రంజన్​ గొగొయిపై సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని ఒకరు ఇటీవలే లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. ఇలా చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని సీనియర్​ న్యాయవాది ఉత్సవ్ బెయిన్స్​ ప్రమాణపత్రం దాఖలు చేశారు. కొన్ని ఆధారాలు సమర్పించారు. వాటిని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు... విచారణ కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేసింది.

కుట్ర కోణంపై తీవ్ర వ్యాఖ్యలు...

అంతకుముందు... 'కుట్ర' వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

"న్యాయవ్యవస్థను అప్రతిష్ఠపాలు చేసేందుకు వ్యవస్థీకృత దాడి జరుగుతోంది. సుప్రీంకోర్టును రిమోట్​ కంట్రోల్​ ద్వారా నియంత్రించవచ్చని ఈ దేశంలోని ధనిక, శక్తిమంతమైన వ్యక్తులు అనుకుంటున్నారా?
ధనం, రాజకీయ శక్తితో సుప్రీంకోర్టును ప్రభావితం చేయలేరు. ఈ విషయాన్ని.. దేశం మొత్తానికి చాటుతాం. దేశంలోని ధనికులు, శక్తిమంతులు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు.. ఆ ఆటను ఆపాలి. 3-4 ఏళ్లుగా న్యాయవ్యవస్థ పట్ల కొందరు వ్యవహరిస్తున్న తీరు మాకెంతో ఆక్రోశం కలిగిస్తోంది. ఇది ఇలానే కొనసాగితే మా అస్తిత్వమే ప్రశ్నార్థకం అవుతుంది."
- సుప్రీం ప్రత్యేక ధర్మాసనం

ఇదీ చూడండి: సైన్యంలోకి నారీ శక్తి- 'నమోదు' ఆరంభం

Last Updated : Apr 25, 2019, 4:54 PM IST

ABOUT THE AUTHOR

...view details