అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి దిగ్గజ ఈ-కామర్స్ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చేందుకు రిలయన్స్ ఇండస్ట్రీస్ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన కసరత్తు తుది దశకు చేరుకున్నట్లు సంబంధిత వర్గాలు అంటున్నాయి. 'న్యూ కామర్స్' పేరిట సరికొత్త కాన్సెప్ట్‌తో మార్కెట్లోకి రిలయన్స్ ప్రవేశించనున్నట్లు ఆయా వర్గాలు తెలిపాయి.
ప్రస్తుతం ఉన్న ఈ-కామర్స్ ఆఫర్లకన్నా భారీ ఆఫర్లను రిలయన్స్ అందించనున్నట్లు సమాచారం.
న్యూ-కామర్స్ వ్యాపారాలు సాగేదిలా..
ఈ-కామర్స్ అంటే పూర్తిగా ఆన్లైన్ మయం. రిలయన్స్ వ్యూహం మాత్రం భిన్నం. న్యూ-కామర్స్ పేరిట ఆఫ్‌లైన్-ఆన్లైన్ సేవలను, వ్యాపారులను, బ్రాండ్లు, వినియోగదారులను అనుసంధానం చేయనుంది.
గత రెండేళ్ల నుంచి ఇందుకు కసరత్తు చేస్తోంది ముకేశ్ అంబానీ నేతృత్వంలోని ఆర్ఐఎల్.
ప్రస్తుతం పలు సూపర్ మార్కెట్లు, హోల్‌సేల్ మార్కెట్లు, స్పెషాలిటీ, ఆన్లైన్ స్టోర్లు నిర్వహిస్తోంది రిలయన్స్.
రెండు దశల్లో పూర్తి..
మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం న్యూ-కామర్స్ వ్యాపారాన్ని రెండు దశల్లో పూర్తి చేయనుంది రిలయన్స్. దీపావళి నాటికి మొదటి దశ ప్రారంభించి.. డిసెంబర్-జనవరి నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది.
అలీబాబా తరహాలోనే..
నిత్యావసర సరుకుల ఆన్లైన్ డెలివరీకి అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబాలానే.. ఆన్లైన్-టు-ఆఫ్‌లైన్ వ్యాపారాల్లో పట్టు సాధించనుంది రిలయన్స్. ఈ విధానంలో వినియోగదారులు తమకు అవసరమైన వస్తువుల ధరలు వంటి వివరాలు చూసుకుని స్థానిక రిలయన్స్ స్టోర్‌కు వెళ్లి కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుంది.
ఇందుకోసం రిలయన్స్ ఇప్పటికే స్థానికంగా ఉన్న చిన్న చిన్న కిరాణాలతోనూ ఒప్పందం కుదుర్చుకుంది.
న్యూ-కామర్స్ విధానం ద్వారా నిర్వాహక ఖర్చులు భారీగా తగ్గనున్నాయి. ఇది దేశీయ సంస్థ కాబట్టి ఇతర ఈ-కామర్స్ సంస్థలకు వర్తించే నిబంధనలు వర్తించవు. ఎంతైనా పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉంటుంది. దేశంలోని 3 కోట్ల కిరాణా దుకాణాలతో అనుసంధానం కానున్నట్లు ఇటీవలి రిలయన్స్ సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు ముకేశ్.
ఆఫర్ల వెల్లువ...
వ్యాపారం ఏదైనా... ప్రారంభంలో ఆఫర్లతో అదరగొట్టి, వినియోగదారుల్ని ఆకర్షించడం రిలయన్స్ వ్యూహం. న్యూ-కామర్స్ విషయంలోనూ అదే చేయనుంది. ఇప్పటికే ఇందుకు అవసరమైన కసరత్తు ప్రారంభించింది.
మార్కెట్ గురించి తెలుసుకునేందుకు వేర్వేరు ప్రాంతాల వినియోగదారులకు ఎస్ఎంఎస్ల ద్వారా ఆఫర్లను పంపుతున్నట్లు సమాచారం. ఎక్కడ డిమాండ్ ఎక్కువగా ఉందో, కొనుగోళ్లు ఎక్కడ బాగా జరుగుతాయో ఒక అంచనాకు వచ్చేందుకే ఈ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వ్యాపారం ప్రారంభించే దీపావళి నాటికి రిలయన్స్ ఆఫర్ల ధమాకా ఖాయంగా కనిపిస్తోంది.
ఇదీ చూడండి : 'భారత్-పాక్ మధ్య శాంతి... ట్రంప్ విజయమే!'