తెలంగాణ

telangana

ETV Bharat / briefs

సోహన వినయ్​ల కల్యాణం కడు రమణీయం - nava yuga

అద్భుతాల రామోజీ ఫిల్మ్​సిటీలో సంబురం అంబరాన్నంటింది. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు.. ఇంట..కల్యాణం వైభోగంగా జరిగింది. రామోజీరావు మనవరాలు.. సుమన్- విజయేశ్వరిల కుమార్తె కీర్తి సోహన, రాయల రఘు-సుభాషిణి కుమారుడు వినయ్‌... మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజకీయ, సినీ, పారిశ్రామిక రంగాలకు చెందిన అతిరథ మహారథులు, ప్రముఖులు హాజరై వధూవరుల్ని ఆశీర్వదించారు.

ramoji-rao-grand-daughter-marriage

By

Published : Apr 20, 2019, 7:44 PM IST

Updated : Apr 21, 2019, 12:26 AM IST

సోహన వినయ్​ల కల్యాణం

బంధు మిత్రుల ఆశీర్వచనాలు.. ఆత్మీయుల అక్షతల మధ్య రామోజీరావు మనవరాలు సోహన వివాహం చూడముచ్చటగా జరిగింది. అతిరథ మహారథులు, ఆత్మీయుల సాక్షిగా మంగళవాద్యాలు, వేదమంత్రోచ్ఛరణల నడుమ.. పచ్చని పెళ్లిపందిరిలో వినయ్-సోహన వివాహబంధంతో ఒక్కటయ్యారు.

ఆకాశమంత పందిరి...భూదేవతంత పీట అన్నట్లుగా రామోజీ ఫిల్మ్‌సిటీలో తీర్చిదిద్దిన సువిశాల ప్రాంగణంలో కల్యాణం కన్నుల పండువగా సాగింది. తెలుగింటి సంప్రదాయం ఉట్టిపడేలా పెళ్లి వేడుకను నిర్వహించారు. చూపుతిప్పుకోనివ్వని పుష్పాలంకరణ, అతిథుల్ని ఆకట్టుకునే ఏర్పాట్లతో కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. బాజాబజంత్రీల మధ్య పెళ్లి పందిరిలోకి అడుగుపెట్టిన వరుడు వినయ్‌కి రామోజీ రావు-రమాదేవి దంపతులు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు.

సకుటుంబ పరివార సమేతంగా, బాజాబజంత్రీల నడుమ పెళ్లి కుమార్తె.. సోహన పల్లకిలో వేదిక వద్దకు చేరుకున్నారు. వేద పండితులు నిర్ణయించిన సుముహూర్తంలో జీలకర్ర, బెల్లం పెట్టించారు... అనంతరం...బంధువులు, ఆత్మీయులు, అతిథులు అక్షతలు వేసి వధూవరులను ఆశ్వీరదించారు

వరుడు వినయ్‌.. బంధుమిత్రుల సమక్షంలో పెళ్లికూతురు సోహన మెడలో మూడు మూళ్లు వేశారు. మాంగల్య ధారణ అనంతరం తలంబ్రాల తంతు కోలాహలంగా సాగింది.

తరలివచ్చిన అతిరథులు

రామోజీ ఇంట జరిగిన వివాహ వేడుకకు.. పలువురు ప్రముఖులు తరలివచ్చారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, తెలుగురాష్ట్రాల గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగరరావు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబునాయుడు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, లావు నాగేశ్వరరావు, ఆర్.సుభాష్ రెడ్డి,సెంట్రల్ విజిలెన్స్​ కమిషనర్ కె.వి. చౌదరి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్, క్రికెటర్ కపిల్ దేవ్, సినీ ప్రముఖులు కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి తదితరులు హాజరయ్యారు.

ఇదీ చదవండి:వినయ సోహనం చిత్రమాలిక

Last Updated : Apr 21, 2019, 12:26 AM IST

ABOUT THE AUTHOR

...view details