భాజపా నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లలో అన్ని రంగాల్లో విఫలమైందని, ఈ విషయంపై తనతో చర్చకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీకి సవాల్ విసిరారు కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల బాధ్యుడు శామ్ పిట్రోడా. సామాజిక మాధ్యమాల్లో అబద్ధాలు ప్రచారం చేస్తూ.. ప్రజలు నిజాలను నమ్మకుండా చేసే వాతావరణాన్ని భాజపా సృష్టిస్తోందని ఆరోపించారు.
పార్టీ ప్రకటనల కోసం ప్రజా ధనాన్ని ప్రధాని మోదీ దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు పిట్రోడా. 'బేటీ బచావో- బేటీ పడావో' పథకానికి ఖర్చు చేసిన సగం నిధులకు సమానమయ్యే ధనాన్ని ప్రకటనల కోసం వాడారని విమర్శించారు.
" రండి సమస్యలపై చర్చిద్దాం. రాహుల్ గాంధీ (కాంగ్రెస్ అధినేత)తో చర్చకు వస్తారా. లేకపోతే నాతో చర్చకు రండి.. నేను గుజరాతీనే"
-- శామ్ పిట్రోడా, కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల బాధ్యుడు
ఏం చేశారో చెప్పండి
ఐదేళ్లలో ఏం చేశారో చెప్పకుండా.. రాహుల్ పౌరసత్వాన్ని ప్రశ్నించడం, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీని విమర్శించడం వంటి చర్యలతో మోదీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాట్లాడుతున్న కాంగ్రెస్ నేత శాం పిట్రోడా
" ఐదేళ్లుగా ఏం చేశారో మాట్లాడండి. సమస్యలపై దృష్టి సారించాలని ప్రధాని మోదీకి సూచిస్తున్నా. ప్రధాని ఓ విషయాన్ని గ్రహించాలి, గుర్తించాలి.. దేశం కోసం రాజీవ్ గాంధీ తన ప్రాణాన్ని త్యాగం చేశారు. 2019లో ఓట్లు కావాలంటే.. 2014లో ఏం హామీలు ఇచ్చారు, ఎన్ని అమలు చేశారో చెప్పండి. కానీ చెప్పుకోవడానికి మీరేం చేయలేదు. అందుకే సమస్యలు కాని వాటిపై ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. 10 కోట్ల ఉద్యోగాలు సృష్టిస్తామన్నారు. ఒక్క ఉద్యోగాన్ని సృష్టించలేదు. 100 స్మార్ట్ సిటీలన్నారు. అవెక్కడున్నాయో.. నేను ఒక్కటీ చూడలేదు. "
- శామ్ పిట్రోడా, కాంగ్రెస్ విదేశీ వ్యవహారాల బాధ్యుడు
ఈ ఎన్నికలు దేశానికి చాలా ముఖ్యం
దేశానికి ఈ ఎన్నికలు చాలా ముఖ్యమని అభిప్రాయపడ్డారు పిట్రోడా. ఈ ఎన్నికలు భాజపా, కాంగ్రెస్ మధ్య పోటీ మాత్రమే కాదని, దేశ భవిష్యత్తును నిర్ణయించేవని అన్నారు. కనీస ఆదాయ పథకాన్ని ఉపాధి హామీకి అనుసంధానిస్తే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటుందని అన్నారు పిట్రోడా.
ఇదీ చూడండి : 'పనితీరుపై మాట్లాడలేకనే గతం మాట్లాడుతున్నారు'