భారత్‌లో సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్‌కు ఒక్కరోజు ముందు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. భాజపా మళ్లీ గెలిస్తే కశ్మీర్ అంశంలో పురోగతి సహా భారత్‌తో శాంతి నెలకొనే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. విదేశీ పాత్రికేయులకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్.
వేరే పార్టీలు గెలిస్తే మతతత్వ వాదులకు భయపడి, కశ్మీర్ అంశంపై వెనక్కి తగ్గే అవకాశం ఉందన్నారు. ఇరు దేశాల మధ్య కశ్మీర్ అంశమే కీలకమని అభిప్రాయపడ్డారు ఇమ్రాన్.
పుల్వామా ఉగ్రదాడిలో 40మంది భారత జవాన్లు అమరులైనప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఘటనకు కారణమైన జైషే ఉగ్రక్యాంపులపై భారత వాయుసేన వైమానిక దాడులు చేసి బదులుతీర్చుకుంది.
మోదీకి ఓటేస్తే పాక్‌ను గెలిపించినట్టే...
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ప్రకటనపై కాంగ్రెస్ స్పందించింది. ఇమ్రాన్ వ్యాఖ్యలు పాక్‌తో భాజపా మైత్రిని అధికారికంగా ధ్రువీకరిస్తున్నాయని ఆరోపించింది. మోదీకి ఓటేస్తే పాకిస్థాన్‌ను గెలిపించినట్లేనని ట్వీట్ చేశారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా. మోదీ మొదటగా పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌తో మైత్రి చేశారని, ఇమ్రాన్ ప్రస్తుతం మోదీకి అత్యంత సమీప స్నేహితులని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.