ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలు పాకిస్థాన్‌పై ఒత్తిడి తెస్తున్న తరుణంలో.. ఆ దిశగా చర్యలు చేపట్టింది దాయాది దేశం. తీవ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్న ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి హఫీజ్ సయీద్‌పై 23 కేసులు నమోదు చేసినట్లు పాక్ అధికారులు తెలిపారు. అతని 12 మంది సన్నిహితులపైనా ఈ కేసులు నమోదైనట్లు వెల్లడించారు.
హఫీజ్ తన సన్నిహితులతో కలిసి జమాత్- ఉద్- దవా(జేయూడీ) సహా ఐదు ట్రస్టుల ద్వారా ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూరుస్తున్నట్లు పాక్ తీవ్రవాద,వ్యతిరేక విభాగం పేర్కొంది. ఈ కేసులపై దర్యాప్తు ప్రారంభించినట్లు అధికారులు చెప్పారు.
ముంబయి మారణహోమానికి పాల్పడిన లష్కరే తోయిబా సంస్థకు జేయూడీనే ప్రధానంగా నిధులు చేరవేస్తోందని ఆరోపణలున్నాయి.