రెండోసారీ విచారణకు రవిప్రకాశ్ గైర్హాజరు టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ చుట్టూ సైబరాబాద్ పోలీసుల ఉచ్చు బిగిస్తోంది. టీవీ9 సంస్థలో భాగస్వామిగా ఉన్న అలంద మీడియా అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో నెలకొన్న వాటాల వివాదంలో రవిప్రకాశ్‌పై సైబరాబాద్ పోలీసులు ఇప్పటికే రెండు కేసులు నమోదు చేశారు. సంస్థ నిర్వహణను అడ్డుకునే ఉద్దేశంతో రవిప్రకాశ్ మరికొందరితో కలిసి ఫోర్జరీ పత్రాలను సృష్టించారంటూ అలందా సంస్థ డైరెక్టర్ కౌశిక్‌రావు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
స్పందించకపోతే అరెస్టు చేసే అవకాశం
పోలీసులు రవిప్రకాశ్‌తో పాటు సినీ నటుడు శివాజీ, టీవీ9 మాజీ సీఎఫ్‌ఓ మూర్తిపై కేసులు నమోదు చేశారు. కేసు విచారణలో భాగంగా పోలీసులు ముగ్గురికి 160 సీఆర్‌పీసీ నోటీసులు జారీ చేయగా రవిప్రకాశ్, శివాజీ స్పందించలేదు. తమకు కొంత గడువుకావాలంటూ కోరారు. ఈ క్రమంలో రవిప్రకాశ్‌కు రెండోసారి నోటీసులు జారీ చేసినా ఆయన విచారణకు హాజరు కాలేదు. చరవాణిలో కూడా అందుబాటులోకి రాకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం వల్ల...ఈ విషయాన్ని పోలీసు అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సమాచారం. ఈసారి 41 సీఆర్‌పీసీ కింద నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్దమవుతున్నట్టు సమాచారం. న్యాయనిపుణులతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ నోటీసులకు రవిప్రకాశ్ స్పందించకపోతే అరెస్టు చేసే అవకాశముంది. నటుడు శివాజీ విషయంలోనూ ఇదే తరహాలో వ్యవహరించే అవకాశముందని సమాచారం.
ఇవీ చూడండి: మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా..