తెలంగాణ

telangana

By

Published : May 1, 2019, 12:42 AM IST

Updated : May 1, 2019, 7:13 AM IST

ETV Bharat / briefs

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూత

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూశారు. ఏప్రిల్​ 30వ తేదీన బంజారాహిల్స్​లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.

ఇటీవల జనసేన అభ్యర్థిగా నంద్యాల లోక్​సభ నుంచి పోటీ

నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి కన్నుమూశారు. ఏప్రిల్​ 3 నుంచి బంజారాహిల్స్​లోని కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఆరోగ్యం విషమించి తుది శ్వాస విడిచారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేన తరఫున నంద్యాల పార్లమెంట్​ సభ్యుడిగా పోటీ చేశారు. 2014లో వైకాపా ఎంపీ అభ్యర్థిగా గెలిచిన ఎస్పీవై రెడ్డి... కొంతకాలం తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. ఇటీవలి ఎన్నికల్లో తెదేపా నుంచి నంద్యాల సీటు ఆశించి భంగపడ్డ ఆయన జనసేనలో చేరారు.

విద్యాభ్యాసం.. ఉపాధి మార్గం

ఎస్పీవై రెడ్డి కడప జిల్లా అంకాలమ్మ గూడూరు గ్రామంలో జూన్ 4, 1950న జన్మించారు. నిట్ వరంగల్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్​లో బ్యాచిలర్ పట్టా పొందారు. ముంబయిలో బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్​లో చేరారు. 1977లో సైంటిఫిక్ ఆఫీసర్ స్థానం నుంచి నిష్క్రమించారు.1979లో ఒక ప్లాస్టిక్ కంటైనర్ల ఉత్పాదక ప్లాంట్‌ను స్థాపించిన ఆయన, 1984లో నంది పైపుల పేరుతో పీవీసీ పైపుల తయారీ రంగంలోకి దిగారు.

రాజకీయ జీవితం

నిరుపేదల కోసం అనేక సహాయక కార్యక్రమాలు నిర్వహించిన ఎస్పీవై రెడ్డి... నంద్యాల ప్రాంతంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. రాజకీయ జీవితం భాజపాతో ప్రారంభమయింది. భాజపా తరఫున 1991 ఎన్నికల్లో నంద్యాల లోక్‌సభ నియోజకవర్గానికి పోటీచేసి భారీ తేడాతో ఓడిపోయారు. 1999 అసెంబ్లీ ఎన్నికలలో నంద్యాల, గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గాల రెండింటికీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. నంద్యాలలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. 2000 సంవత్సరంలో కాంగ్రెస్ తరఫున పురపాలక ఛైర్మన్ అభ్యర్థిత్వానికి టికెట్ పొంది, భారీ మెజారిటీతో గెలిచారు. 2004లో నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి లక్ష మెజారిటీ సాధించారు. 2009లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి గెలిచారు. 2014 లో వైకాపా తరఫున పోటీ చేసి 1.08 లక్షల మెజారిటీతో నంద్యాల ఎంపీగా మూడోసారి గెలుపొందారు. తర్వాత తెదేపాలో చేరిన ఆయనకు... ఇటీవలి ఎన్నికల్లో టికెట్ దక్కలేదు. ఈ కారణంగా.. జనసేన అభ్యర్థిగా పోటీలో నిలిచారు. ఫలితాలు రాకముందే.. ఆయన తుది శ్వాస విడిచారు.

ఇవీ చూడండి : కారు బోల్తా పడి ముగ్గురు విద్యార్థుల మృతి

Last Updated : May 1, 2019, 7:13 AM IST

ABOUT THE AUTHOR

...view details