ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యంగా పాలనా సంస్కరణలను వేగంవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అవినీతి ఆరోపణలు ఉన్న శాఖలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ఉద్యోగుల్లో జవాబుదారీ తనం పెంచేలా నూతన రెవెన్యూ, పురపాలక చట్టాల తయారీకి సర్కారు సంకల్పించింది.
నూతన రెవెన్యూ చట్టాల రూపకల్పనకు సర్కారు శ్రీకారం అవినీతి నిర్మూలనే లక్ష్యం
మొదటి దఫా పాలనలో పలు సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అవినీతి రహిత సేవలు అందేలా ప్రణాళికలు రచించి అమలు చేశారు. రెండో దఫాలోనూ సంస్కరణలను మరింత పకడ్బందీగా రూపొందించి అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. అవినీతి ఆరోపణలు అధికంగా వస్తున్న రెవెన్యూ, పురపాలక శాఖలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అవినీతికి ఆస్కారం లేని విధంగా ప్రజలకు పారదర్శకమైన సేవలందేలా ఈ చట్టాలు ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు.
సంస్కరణలు భారీ స్థాయిలో
రైతులకు సరళతరమైన సేవలందించేందుకు భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం చేపట్టినప్పటికీ... కొందరు అధికారుల నిర్లక్ష్యం కారణంగా అనుకున్న ఫలితాలు రాలేదు. అన్నదాతల నుంచి అధిక సంఖ్యలో ఫిర్యాదులు వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ, పురపాలక శాఖల్లో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురావాలని కేసీఆర్ భావిస్తున్నారు. పారిశ్రామిక అనుమతుల కోసం రూపొందించిన టీఎస్ఐపాస్ విధానం సత్ఫలితాలివ్వడం వల్ల ఈ రెండు శాఖల్లోనూ అదే తరహాలో ఆన్లైన్లో లావీదేవీలు, అనుమతుల ప్రక్రియ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. సీఎం ఆదేశాలతో దేశ వ్యాప్తంగా ఉన్న ఉత్తమ విధానాలు, అనుభవాలను పరిగణలోకి తీసుకుంటూ నూతన చట్టాల రూపకల్పనకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలు, ఉపాధ్యాయ వ్యవస్థపై కూడా ముఖ్యమంత్రి దృష్టి సారించబోతున్నారని పార్టీ వర్గాల సమాచారం.
ప్రభుత్వం సూచించిన విధంగా నూతన చట్టాలు రూపొందితే రెవెన్యూ, పురపాలక శాఖల్లో అవినీతి కొంతైనా తగ్గి.. ప్రజలకు పారదర్శక సేవలందే వీలుంది.
ఇదీ చదవండి : ఎన్నికల సాధారణ, వ్యయ పరిశీలకులు వీరే