ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభం ఈనెల 22న జరిగిన మూడు శాసన మండలి స్థానాలకు కౌంటింగ్ ప్రారంభమైంది. మూడు మండలి స్థానాల నుంచి 33 మంది అభ్యర్థులు పోటీ చేశారు. కరీంనగర్లో లెక్కింపుకేంద్రాలు
మెదక్-నిజామాబాద్- ఆదిలాబాద్- కరీంనగర్ పట్టభద్రుల స్థానానికి, మెదక్- నిజామాబాద్-ఆదిలాబాద్- కరీంనగర్ ఉపాధ్యాయ స్థానానికి ఓట్లు లెక్కిస్తున్నారు. కరీంనగర్లోని ఇండోర్ స్టేడియంలో లెక్కింపు మొదలైంది. పట్టభద్రుల స్థానంలో 1,15,458 మంది ఓటుహక్కు వినియోగించుకోగా, 59.03 శాతం ఓట్లు పోలయ్యాయి. ఉపాధ్యాయ స్థానంలో 19,349 మంది ఓటు వేయగా 83.54 శాతం ఓటింగ్ నమోదైంది. పట్టభద్రుల మండలి నియోజకవర్గంలో 17 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఉపాధ్యాయ కోటాలో ఏడుగురు బరిలో నిలిచారు.
నల్గొండలో ఓట్ల లెక్కింపు
వరంగల్- ఖమ్మం-నల్గొండ ఉపాధ్యాయ స్థానానికి నల్గొండలో ఓట్లు లెక్కిస్తున్నారు. పట్టణ శివారులోని దుప్పలపల్లి ఎఫ్సీఐ గోదాములో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఏర్పాట్లు చేశారు. ఈ స్థానం నుంచి 9 మంది అభ్యర్థులు పోటీ చేశారు.ఓట్ల లెక్కింపు జరుగుతున్న ప్రాంతాల్లో పటిష్ఠ భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రక్రియ జరుగుతోంది.
ఫలితాలపై సందిగ్ధం
ఓట్ల లెక్కింపు పూర్తైనప్పటికీ ఫలితాలపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తరువాతే స్పష్టత రానుంది.
ఇదీ చదవండి:భారత్ భేరి: 5% ఓట్లు ఫేస్బుక్, ట్విట్టర్వే!