'ఆర్థికపరమైన ఆలోచనతో పార్టీ మారడం లేదు' - 'ఆర్థికపరమైన ఆలోచనతో పార్టీ మారడం లేదు'
చావైనా...రేవైనా...కార్యకర్తల అభిప్రాయం మేరకే నడుచుకుంటానని స్పష్టం చేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి... కొందరు యువకులు తాను పార్టీ మారుతానంటే వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఇవాళ పెద్ద అంబర్‌పేటలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాలులో సమావేశమైన ఆయన మునుగోడు నియోజకవర్గానికి చెందిన కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారు.
కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సరిగా లేవని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయాలని ప్రజలు తనను కోరుతున్నారని అన్నారు. కార్యకర్తలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని... రాబోయే రోజుల్లో తాను తీసుకునే నిర్ణయాన్ని అందరూ హర్షిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. తన సోదరుడు వెంకటరెడ్డి వ్యక్తిగత అభిప్రాయం చెప్పారని తెలిపారు. కాంగ్రెస్‌లోనే కొనసాగినా ఆయన అభిప్రాయాన్ని తాను గౌరవిస్తానన్నారు. ఆర్థికపరమైన ఆలోచనలతో తాను పార్టీ మారడం లేదని స్పష్టంచేశారు. దేశంలో జాతీయవాదంతో ముందుకెళ్తున్న భాజపా క్రమంగా బలోపేతం అవుతోందన్నారు. తనది వ్యక్తిగత నిర్ణయమని తెలిపారు.