తెలంగాణ

telangana

ETV Bharat / briefs

ఇంటర్​ వ్యవహారం... దిద్దుబాట్లకు శ్రీకారం - education

అధికారుల అలసత్వమో.. ప్రభుత్వ పర్యవేక్షణ లోపమో.. లక్షలాది మంది ఇంటర్​ విద్యార్థులు  రోడ్డెక్కారు. వారికి ప్రజాసంఘాలు, రాజకీయ నేతలు తోడయ్యారు. ఈ సంఘటనలతో అప్రమత్తమైన సర్కారు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. త్రిసభ్య కమిటీని నియమించింది. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల జవాబు పత్రాలు ఉచితంగా రీవెరిఫికేషన్​ చేసేందుకు ఇంటర్​ బోర్టు నిర్ణయించింది. గ్లోబరీనా సాఫ్ట్​వేర్​లో కొన్ని లోపాలను గుర్తించిన కమిటీ కొన్ని సిఫార్సులు చేయనుంది.

ఇంటర్​ వ్యవహారం... దిద్దుబాట్లకు శ్రీకారం

By

Published : Apr 25, 2019, 9:05 PM IST

ఇంటర్​ వ్యవహారం... దిద్దుబాట్లకు శ్రీకారం

ఇంటర్​ ఫలితాల వ్యవహారం రోజురోజుకు ఓ మలుపు తిరిగిన నేపథ్యంలో ఇంటర్​ బోర్డు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొంది. ఈ వ్యవహారంపై బుధవారం విద్యాశాఖ మంత్రి, అధికారులతో సమావేశమైన సీఎం కేసీఆర్​ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. విద్యార్థులకు ఎటువంటి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.
ఫెయిల్ అయితే దరఖాస్తు అవసరం లేదు
ఇంటర్​ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఉత్తీర్ణులు కాని విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని బోర్డు వెల్లడించింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో వారందరికి ఉచితంగానే రీవెరిఫికేషన్​ చేస్తామని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్​రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి రుసుము తిరిగి చెల్లిస్తామన్నారు. ఉత్తీర్ణులైన విద్యార్థులు మాత్రం ఫీజు చెల్లించాలని, మార్కులు కలిస్తే మాత్రం రుసుము తిరిగి చెల్లిస్తామని స్పష్టంచేశారు. మే 16 నుంచి జరగాల్సిన సప్లిమెంటరీ పరీక్షలను కొన్నిరోజులు వాయిదా వేయాలని భావిస్తున్నారు. సమాచార చట్టం ద్వారా జవాబుపత్రాలు ఇవ్వలేమని జనార్దన్​రెడ్డి తెలిపారు.

ఇంటర్​ ఫలితాల వ్యవహారం రోజురోజుకు ముదిరిపోవడం.. విద్యార్థుల ఆత్మహత్యలు, తల్లిదండ్రుల ఆందోళలనతో ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ... గత మూడు రోజులుగా సుధీర్ఘంగా విచారించింది. గ్లోబరీనా సాఫ్ట్​వేర్​లో లోపాలను గుర్తించింది. వెంటనే వాటిని సరిదిద్దాలని.. లేకుంటే మళ్లీ అవే తప్పులు వచ్చే అవకాశం ఉందని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది.

బోర్డు ముందు కొత్త సవాళ్లు..!

విద్యార్థుల జవాబు పత్రాలను వాటి బార్​కోడ్​లను వేరుచేయడం, సబ్జెక్టుల వారీగా ఉత్తీర్ణులు కాని వారి వివరాలను సేకరించడం సవాల్​గా మారనుంది. ఈ సమస్య పరిష్కరించేందుకు అధ్యాపక సంఘాలతో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్​రెడ్డి సమావేశమయ్యారు. వేసవి సెలవులు రద్దుచేసుకొని, అదనపు గంటలు పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. అందుకు అధ్యాపక సంఘాల ప్రతినిధులు స్వాగతించారు.

మొత్తం మీద ఇంటర్ బోర్డ్, విద్యాశాఖ తీసుకుంటున్న చర్యలతో విద్యార్థులకు ఎంత వరకు న్యాయం జరుగుతుందో చూడాలి.

ఇవీ చూడండి: ఫెయిలైన వాళ్లకు సరే... మరి మా పరిస్థితి?

ABOUT THE AUTHOR

...view details