తెలంగాణ

telangana

ETV Bharat / briefs

'నిందితులందరికీ ఉరిశిక్ష పడుతుందనుకున్నాం' - Pathankot

కథువా ఘటనలో కోర్టు తీర్పును స్వాగతించారు బాధితురాలి కుటుంబసభ్యులు. అత్యాచార ఘటనలో దోషులందరికీ ఉరిశిక్ష పడుతుందని భావించినట్లు తెలిపారు. ఏడుగురు నిందితుల్లో ఒకరు శిక్ష నుంచి తప్పించుకోవడంపై విచారం వ్యక్తం చేశారు.

'నిందితులందరికీ ఉరిశిక్ష పడుతుందనుకున్నాం'

By

Published : Jun 11, 2019, 6:13 AM IST

దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన జమ్ముకశ్మీర్‌లోని కథువా అత్యాచార ఘటనలో పఠాన్‌కోట్‌ న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. కోర్టు తీర్పుపై స్పందించారు బాధితురాలి కుటుంబ సభ్యులు. స్వాగతిస్తున్నట్లు ప్రకటించారు. అయితే దోషులందరికీ ఉరిశిక్ష విధిస్తారని భావించినట్లు బాధితురాలి తండ్రి తెలిపారు. మొత్తం ఏడుగురు నిందితుల్లో ఒకరు శిక్ష నుంచి తప్పించుకోవడంపై విచారం వ్యక్తం చేశారు.

" నా కూతురిపై ఘాతుకానికి పాల్పడ్డ నిందితులందరికీ న్యాయస్థానం ఉరిశిక్ష విధిస్తుందనుకున్నా.. శిక్ష నుంచి తప్పించుకున్న నిందితుడే ఈ అత్యాచారంలో కీలకంగా ఉన్నాడని నేను విన్నాను. మరి అలాంటప్పుడు అతణ్ని కోర్టు శిక్షించకుండా ఎందుకు వదిలేసిందో అర్థం కాలేదు."
- కథువా ఘటన బాధితురాలి తండ్రి

కోర్టు తీర్పు

జమ్ముకశ్మీర్​లో 8 ఏళ్ల చిన్నారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, హత్య చేసిన ఘటనలో ఆరుగురు నిందితులను దోషులుగా తేల్చింది పఠాన్​కోట్​ కోర్టు. ప్రధాన నిందితుడైన సాంజీరామ్‌తో పాటు దీపక్‌ ఖజూరియా, పర్వేశ్‌కుమార్‌లకు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరో ముగ్గురు పోలీసులు ఎస్‌ఐ ఆనంద్‌ దత్త, హెడ్‌ కానిస్టేబుల్‌ తిలక్‌ రామ్‌, ప్రత్యేక పోలీసు అధికారి సురేందర్‌ వర్మలకు ఐదేళ్ల చొప్పున జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో మొత్తం ఏడుగురిని పోలీసులు నిందితులుగా పేర్కొనగా.. సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా సాంజీరామ్‌ కుమారుడు విశాల్‌ను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. మిగతా ఆరుగురిని దోషులుగా తేల్చిన న్యాయస్థానం వారికి శిక్షలు ఖరారుచేసింది.

ఇదీ జరిగింది

జమ్ముకశ్మీర్​లోని కథువాలో ఉన్న ఓ ఆలయంలో ఈ ఘాతుకం జరిగింది. కథువాలోని రసానా గ్రామానికి చెందిన ఓ చిన్నారి 2018 జనవరి 10న గుర్రాలను మేపడానికి వెళ్లి అదృశ్యమైంది. దీంతో చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే సరిగ్గా వారం రోజుల తర్వాత జనవరి 17న గ్రామానికి సమీపంలోని ఓ అటవీప్రాంతంలో బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పోస్టుమార్టం నిర్వహించగా.. బాలికను అతి దారుణంగా సామూహిక అత్యాచారం చేసి హత్య చేసినట్లు తేలింది. చిన్న భూవివాదం కారణంగా ఏర్పడిన విద్వేషంతో అభంశుభం తెలియని చిన్నారిపై ఆ మృగాళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు.

ఇదీ చూడండి : మోదీ విమానానికి పాకిస్థాన్​ పచ్చజెండా

ABOUT THE AUTHOR

...view details