వానరాల బెడద పల్లె, పట్టణాల్లో తీవ్రంగా మారిపోయింది. ఇళ్లలోకి చొరబడి ఆహార పదార్థాలు ఎత్తుకెళ్లడం.. చేలపై దాడి చేయడం.. ఒకటేమిటి చాలా సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. గుంపులుగా తిరుగుతూ ఇవి చేసే దాదాగిరి అంతాఇంతా కాదు. వీటి భయంతో కొంతమంది తమ ఇంటి పెరట్లో కూరగాయలు పెంచడం మానేస్తుంటే.. కొందరు రైతులైతే కోతులు ముట్టని పంటలు పండించడానికే మొగ్గుచూపుతున్నారు. దీనికి ప్రధాన కారణం అడవులు తగ్గిపోవడం.
సమస్య తీవ్రత పెరిగినందువల్ల కోతుల సంతతిని అరికట్టేందుకు అటవీశాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. సంతానోత్పత్తి కలగకుండా మగ కోతులకు ఆపరేషన్ చేసే పరిజ్ఞానమే ఇప్పటివరకు ఉండగా... తాజాగా ఆడ కోతుల్లోనూ సంతానోత్పత్తిని నివారించే పరికరాలు అందుబాటులోకివచ్చాయి. ప్రత్యేక భవనాల నిర్మాణం, ఆపరేషన్ థియేటర్లతో ‘ఆపరేషన్ మర్కటం’కు అటవీశాఖ సిద్ధమవుతోంది.
ఆపరేషన్ కోసం ప్రత్యేకంగా...
నిర్మల్ జిల్లా కేంద్రానికి సమీపంలోని చించొలిలో కోతుల సంతతి నిరోధక ఆపరేషన్లు చేసే థియేటర్‌ను అటవీశాఖ ప్రయోగత్మకంగా అందుబాటులోకి తీసుకురానుంది. భవన నిర్మాణం.. వైద్యులకు శిక్షణ ఇప్పటికే పూర్తయ్యాయని.. ఆపరేషన్ పరికరాలు తేవాల్సిఉందని చెబుతున్నారు. గ్రామాలు, పట్టణాల్లో పట్టుకునే కోతుల్ని ఈ కేంద్రానికి తీసుకెళ్లి పిల్లలు పుట్టకుండా శస్త్రచికిత్స చేస్తారు. ఒకేదఫా 250 కోతులను ఉంచేలా ఈ కేంద్రం అందుబాటులోకి వస్తుందన్నారు. చికిత్స అనంతరం అవి కోలుకునేవరకు 10 రోజులపాటు అక్కడే ఉంచి... గాయంమానాక వాటిని విడిచిపెడతామని అధికారులు చెబుతున్నారు.
రాష్ట్రంలో మరో నాలుగుచోట్ల
ఒక్కో కోతి జీవితకాలం గరిష్ఠంగా 20 ఏళ్ల వరకు ఉంటుంది. ఆడ కోతులు 10-12 పిల్లల్ని కంటాయి. వీటి సంతాన నియంత్రణ శస్త్రచికిత్సల కోసం చించొలిలో ఏర్పాటుచేసే ఆపరేషన్ థియేటర్ విజయవంతమైతే తర్వాత హైదరాబాద్, వరంగల్, ఖమ్మంతో పాటు మరోచోట అలాంటి కేంద్రాలను ఏర్పాటుచేయాలని అటవీశాఖ యోచిస్తోంది.
పిల్లలు పుట్టకుండా కోతులకు ఆపరేషన్లు - సంతతి నిరోధక ఆపరేషన్లు
కోతులు... ఇళ్లలోకి వచ్చి ఆహార పదార్థాలని దొంగిలించాలన్న అవే... పంటచేలపై దాడి చేసి ఇబ్బంది పెట్టాలన్నా అవే... ఇల్లుపీకి పందిరేయడంలో వాటికి లేదు సాటి. చిలిపి చేష్టలతో ఆటలాడిస్తూ చిరాకు తెప్పించగలిగే సత్తా కలిగినవి. పల్లెలే కాకుండా పట్టణాల్లో కూడా మానవ జాతిని ఇబ్బంది పెడుతున్న వీటి సంతతిని అరికట్టేందుకు అటవీశాఖ ప్రయత్నిస్తోంది. కోతులకు సంతాన నియంత్రణ చేసేందుకు సన్నద్ధమవుతోంది.
సంతతి నిరోధక ఆపరేషన్లు
ఇవీ చూడండి: 'దేశంలోనే 14వ ఉత్తమ ఠాణాగా సంస్థాన్ నారాయణపురం'