కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'జన్‌ధన్' పథకం మరో మైలురాయిని చేరుకోబోతోంది. జన్‌ధన్ ఖాతాల్లో డిపాజిట్ చేసిన సొమ్ము త్వరలో రూ.90 వేల కోట్లకు చేరనుంది.
కేంద్రం ప్రమాద బీమా లక్ష నుంచి 2 లక్షల రూపాయలకు పెంచిన అనంతరం జన్‌ధన్ ఖాతాల్లో డిపాజిట్లు ఊపందుకున్నాయి. కేంద్ర ఆర్థికమంత్రిత్వశాఖ గణాంకాల ప్రకారం 2017 మార్చి తరువాత క్రమంగా పెరుగుతోన్న నిల్వలు ఈ ఏడాది జనవరి 30 నాటికి రూ.89,257 కోట్లకు చేరుకున్నాయి.
దేశ ప్రజలందరికీ బ్యాంకింగ్ సేవలు అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2014 ఆగష్టు 28న జన్‌ధన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2018లో ఈ ఖాతాదారులకు కల్పించే ప్రమాద బీమా రూ.2 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే ఓవర్‌డ్రాఫ్ట్ పరిమితిని రూ.10 వేలకు పెంచింది. దీంతో బ్యాంకు ఖాతాలేని వారు సైతం జన్‌ధన్‌లో డిపాజిట్లు చేయడానికి ఉత్సాహం చూపి ఈ జన్‌ధన్ డిపాజిట్లు ఒక్కసారిగా ఊపందుకున్నాయి.
ప్రస్తుతానికి ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకం కింద సుమారు 34 కోట్ల 14 లక్షల మంది ఖాతాదారులు ఉన్నారు. వీరిలో 53 శాతం మంది మహిళలే ఉన్నారు. వీరిలో 59 శాతం మంది గ్రామీణ, సెమీ అర్బన్ ప్రాంత మహిళలు కావడం విశేషం.
అయితే ఇప్పటి వరకు 27.26 కోట్ల మంది ఖాతాదారులకు ప్రమాదబీమా కవరేజీతో కూడిన రూపే డెబిట్ కార్డులను అందజేశారు.