రఫేల్ ఒప్పందంలో మోదీ రాజద్రోహి అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై రవిశంకర్ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయంపై పార్లమెంట్ ఆవరణలో స్పందించారు కేంద్ర న్యాయశాఖ మంత్రి.
రాహుల్ గాంధీ ప్రధానిపై బాధ్యతారహితంగా ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు. గత కాంగ్రెస్ ప్రభుత్వాలకు, మోదీ ప్రభుత్వానికి మధ్య చాలా వ్యత్యాసముందని రవిశంకర్ తెలిపారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో రక్షణ ఒప్పందాలు జరిగినా... కాంగ్రెస్ నాయకులనెప్పుడూ దేశద్రోహులుగా విమర్శించలేదని గుర్తుచేశారు.
ప్రధానిపై బుదర చల్లాలని ప్రయత్నిస్తున్న రాహుల్ అదే బురదని తమ మొహంపైనే చల్లుకుంటున్నారని ఆరోపించారు.
రఫేల్ ఆరోపణలపై రాహుల్ చూపుతున్న ఈ-మెయిల్ యుద్ధవిమానాలకు సంబంధించినది కాదు. అది వేరే హెలికాఫ్టర్ కొనుగోలుకు సంబంధించినదని వివరించారు. యూరోపియన్ ఎయిర్‌క్రాఫ్ట్ సంస్థ ఎయిర్‌బస్ ఈ-మెయిల్ రాహుల్ గాంధీకి ఎలా వచ్చిందో సమాధానం చెప్పాలని న్యాయశాఖ మంత్రి డిమాండ్ చేశారు.
మాట్లాడుతున్న కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ "ఎయిర్‌బస్ సంస్థ ఈ-మెయిల్స్ తనకెలా అందాయో రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని ప్రశ్నిస్తున్నాం. మీరు దేశ రక్షణతో ఆటలాడుతున్నారు. విదేశీ కంపెనీలకు రాహుల్ గాంధీనే మధ్యవర్తిగా వ్యవహరించారు."
- రవిశంకర్ ప్రసాద్, కేంద్ర న్యాయశాఖ మంత్రి
ప్రధానిపై రాహుల్ ఆరోపణలు...
ప్రధాని రఫేల్ ఒప్పందానికి ముందు ఫ్రాన్స్ రక్షణమంత్రిని కలిసి యుద్ధ విమానాల తయారీ డీల్ అనిల్ అంబానీకి దక్కేలా సంప్రదింపులు జరిపారని పాత్రికేయుల సమావేశంలో ఆరోపించారు రాహుల్. ఫ్రాన్స్ ప్రభుత్వానికి, అనిల్ అంబానీకి మధ్య సమన్వయకర్తగా వ్యవహరించిన మోదీ దేశద్రోహని రాహుల్ విమర్శించారు.