YSRCP Incharges List :ప్రశ్నించే గొంతును కోస్తారని వైఎస్సార్సీపీ సమన్వయకర్తల మూడో జాబితా ప్రకటనతో వైఎస్సార్సీపీ అధిష్ఠానం మరోసారి రుజువు చేసింది. "దళితులుగా పుట్టడం మేం చేసిన నేరమా? నేనేం తప్పు చేశానని నాకు టికెట్ ఆపేస్తారు?" అంటూ ప్రశ్నించిన పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు (MLA MS Babu)ను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేశారు. సీఎం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని ఆ ఎమ్మెల్యే చేసిన విజ్ఞాపనను పరిగణనలోకి తీసుకోకుండా ఇన్‌ఛార్జిగా డాక్టర్ మూతిరేవుల సునీల్‌కుమార్‌ను నియమించారు. ఈయన 2014-19 మధ్య ఇదే పూతలపట్టు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు బాబుకు అన్యాయం చేసినట్లే 2019లో సునీల్‌ను పక్కన పెట్టారు. అవమానభారంతో ఆత్మహత్య చేసుకుంటానంటూ ఆయన విడుదల చేసిన సెల్ఫీ వీడియో అప్పట్లో సంచలనమైంది. జగన్‌ను కలిసేందుకు లోటస్‌పాండ్‌కు వెళ్లి పడిగాపులు కాసినా నాడు దర్శనభాగ్యం దక్కలేదు. అయిదేళ్ల తర్వాత మళ్లీ ఆయన్ను నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా ఎంపిక చేశారు.
సీఎం మాట్లాడినా అసంతృప్తిపై మెత్తబడలేదని మాజీ మంత్రి, బీసీ ఎమ్మెల్యేకొలుసు పార్థసారథికి పెనమలూరు టికెట్ గల్లంతు చేశారు. రాయదుర్గంలో బీసీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని తప్పించి ప్రభుత్వంలో, పార్టీలో అన్నింటా ప్రాధాన్యమున్న సామాజికవర్గానికి చెందిన ఏపీఐఐసీ ఛైర్మన్ మెట్టు గోవిందరెడ్డిని పార్టీ ఇన్‌ఛార్జిగా ప్రకటించారు. కాపు సామాజికవర్గానికి చెందిన చిత్తూరు, దర్శి ఎమ్మెల్యేలు ఆరణి శ్రీనివాసులు, మద్దిశెట్టి వేణుగోపాల్ స్థానాల్లోనూ విజయానందరెడ్డి, బూచేపల్లి శివప్రసాదరెడ్డిలను సమన్వయకర్తలుగా నియమించారు. శివప్రసాదరెడ్డి తల్లి ప్రస్తుతం ఉమ్మడి ప్రకాశం జడ్పీ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు.
వైఎస్సార్సీపీలో ముగిసిన మార్పులు చేర్పుల పర్వం- సిట్టింగులకు జగన్ మొండిచేయి
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ టెక్కలి నియోజకవర్గంలో అరాచకాలు చేస్తున్నారని ఆయన భార్యే ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. దాంతో అప్పటివరకూ టెక్కలి వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్‌ను ఆ బాధ్యతల నుంచి తప్పించి ఆయన భార్య వాణిని అక్కడ నియమించారు. కొన్ని నెలలు కూడా గడవక ముందే, తిరిగి దువ్వాడ శ్రీనివాస్‌నే టెక్కలి సమన్వయకర్తగా నియమిస్తున్నట్లు ప్రకటించారు.
ఉమ్మడి శ్రీకాకుళం జడ్పీ ఛైర్‌పర్సన్ పిరియా విజయకు ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి కృష్ణా జడ్పీ ఛైర్‌పర్సన్ ఉప్పాల హారిక భర్త ఉప్పాల రామును పెడన అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యుడిగా నియమించారు. ఇచ్ఛాపురంలో ప్రస్తుత సమన్వయకర్తగా ఉన్న పిరియా సాయిరాజ్‌ను తప్పించి, ఆయన భార్య పిరియా విజయకు బాధ్యత అప్పగించారు. ఉమ్మడి శ్రీకాకుళం జడ్పీ ఛైర్‌పర్సన్ పిరియా విజయను ఇచ్ఛాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జిగా నియమించినందున జడ్పీ ఛైర్‌పర్సన్ పదవికి ఇచ్ఛాపురం జడ్పీటీసీ సభ్యురాలు ఉప్పాడ నారాయణమ్మను ఎంపిక చేసినట్లు ప్రకటించారు.
రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డిని మూడు రోజుల క్రితం సీఎం జగన్ పిలిచి మాట్లాడి ఈసారీ మీరే కొనసాగుతారని చెప్పి పంపారు. కానీ, గురువారం ఉమ్మడి కడప జడ్పీ ఛైర్‌పర్సన్, రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్‌రెడ్డిని సమన్వయకర్తగా ప్రకటించారు. మల్లికార్జునరెడ్డి 2019 ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వ విప్‌గా ఉన్నారు. ఆ పదవిని వదులుకుని అప్పట్లో ఆయన వైకాపాలో చేరారు. అధికారంలోకి వస్తే మంత్రి పదవి ఇస్తామని ఆయనకు వైసీపీ పెద్దలు హామీ ఇచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చినా మల్లికార్జునరెడ్డికి ఏ పదవీ దక్కలేదు. ఇప్పుడు టికెట్ కూడా గల్లంతైంది.