Yellow Crazy Ants: చీమలే కదా..! నలిపేస్తే పోతాయని అనుకుంటాం. కానీ అవి లక్షల సంఖ్యలో గుంపులుగా దండెత్తి వస్తే మనుషులు పారిపోవాల్సిందే! తమిళనాట అటవీ ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి తలెత్తింది. ఇక్కడ చీమలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దండులా దండెత్తుతున్న ఈ చీమలు ఏది కనబడితే దాన్ని తినేస్తుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. కొందరు ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. కరంతమలై రిజర్వ్ ఫారెస్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో 'ఎల్లో క్రేజీ యాంట్స్' అనే చీమలు విజృంభిస్తున్నాయి.
సన్నగా.. చిన్నగా ఉండే ఈ చీమలు చాలా చురుగ్గా కదులుతుంటాయి. ఇవి చిన్నచిన్న కీటకాలను, పురుగులను చంపేస్తుంటాయి. స్థానిక జాతుల కీటకాలు, చీమల పుట్టల్ని ఆక్రమించి వాటిని నాశనం చేస్తుంటాయి. ఒకటని కాదు ఏది దొరికితే దానిని తినేస్తాయి. ప్రస్తుతం దిండుక్కల్ జిల్లా కరంతమలై రిజర్వ్ ఫారెస్ట్ పరిసరాల్లోని సుమారు ఏడు గ్రామాలపై దండయాత్ర చేస్తున్నాయి. పంటపొలాల్ని నాశనం చేస్తుండటంతోపాటు రైతులకు చెందిన మేకలు, పశువులు, ఎద్దులకు హాని చేస్తున్నాయి. ఎలుకలు, పిల్లులు, కుందేళ్లనూ స్వాహా చేస్తున్నాయి. పాములు, బల్లులను గుంపులుగా చుట్టుముట్టి అవలీలగా భోంచేస్తున్నాయి. పశువులకు గాయాలైన చోట్ల మాంసాన్ని తినేస్తున్నాయి. వీటి ప్రభావంతో కొన్ని పశువులు చనిపోయాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేకలు, పశువులు చూపు కోల్పోతున్నాయి.
నిలువునా చుట్టేస్తాయ్..
ఈ చీమల బెడద గతంలో ఎప్పుడూ లేదని వేలాయుధంపట్టి వాసులు చెబుతున్నారు. అడవుల నుంచి లక్షల సంఖ్యలో ఇవి గ్రామాల్లోకి వచ్చేస్తున్నాయి. చల్లటి వాతావరణంలో వీటి దాడి మరింత ఎక్కువగా ఉంటోంది. వీటి ప్రభావంతో ఇక్కడి జనజీవనం అస్తవ్యస్తమైంది. ఇంటినుంచి బయటికి రావడానికే భయపడుతున్నారు. ఎక్కడైనా నిల్చుంటే చాలు సెకన్లలోనే శరీరం పైకి పాకేస్తున్నాయి. ఇవి కుట్టవు.. కరవవు.. కానీ పొత్తికడుపు కొన వద్ద ఉండే ఒక చిన్న గొట్టం ద్వారా ఇవి భయంకరమైన ఫార్మిక్ యాసిడ్‌తో కూడిన ద్రవాన్ని వెదజల్లుతుంటాయి. ఆ యాసిడ్ పడినచోట దురద, చర్మం పొట్టులా రాలడం వంటి సమస్యలు వస్తాయి. పశుపక్ష్యాదుల కంట్లో పడితే చూపు పోతుంది. కుంటల్లో నీళ్లు తెచ్చుకోవాలన్నా అక్కడా వేల సంఖ్యలో చీమలుంటున్నాయని, తమ రోజువారీ జీవనం దుర్భరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీమల మందు వంటివి చల్లుతున్నా వాటి తీవ్రత తగ్గడం లేదని చెప్పారు.