Wrong parking charges: పార్కింగ్ సమస్యకు చెక్ పెట్టేందుకు వినూత్న ఆలోచనతో కేంద్రం ముందుకొస్తోంది. చేయకూడని చోట వాహనాన్ని పార్కింగ్ చేసి నిర్లక్ష్యపూరితంగా వ్యవహరించే వారికి ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇకపై రాంగ్ పార్కింగ్‌లో ఉన్న వాహనం ఫొటోను ఎవరైనా పంపినప్పుడు వారికి వెయ్యి రూపాయలు ఫైన్ పడితే.. పంపించిన వ్యక్తికి రూ.500 రివార్డు రూపంలో ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీని కోసం ఓ చట్టం తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
" ఎవరైనా వ్యక్తి రాంగ్ పార్కింగ్‌లో ఉన్న వాహనం చిత్రాన్ని పంపితే వారికి రివార్డ్ ఇస్తాం. జరిమానా రూ.1000 అయినప్పుడు.. రూ.500 వరకు రివార్డు అందివ్వాలని అనుకుంటున్నాం. ఇందుకోసం ఓ చట్టం తీసుకురానున్నాం. అప్పుడే పార్కింగ్ సమస్య పరిష్కారమవుతుంది"
- నితిన్ గడ్కరీ, కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి.