దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో మరోసారి మోదీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. కరోనా కేసులు తగ్గినప్పుడు తన ఘనతగా చెప్పుకుని.. ఇప్పుడు ఉద్ధృతి పెరిగితే నెపం రాష్ట్రాలపై వేస్తున్నారని ప్రధాని మోదీపై మండిపడ్డారు. కరోనా వ్యాప్తికి కారణమయ్యే కార్యక్రమాలను మోదీ, అమిత్ షా ప్రోత్సహించారని ఆరోపించారు. పీటీఐ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశంలో నెలకొన్న పరిస్థితులపై రాహుల్ మాట్లాడారు. దేశంలో కొవిడ్ వ్యాప్తి చూసి ప్రపంచమే వణుకుతోందన్నారు.
" దేశంలో కరోనా కేసులు పెరుగుతుంటే మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. వారి దృష్టి అంతా ఎన్నికల ప్రచారంపైనే పెట్టారు. వైరస్ వ్యాప్తికి కారణమయ్యే కార్యక్రమాలను ప్రోత్సహించారు. ప్రధాని మోదీ, అమిత్ షా మాస్కు ధరించటమే మర్చిపోయారు. ఇలాంటి చర్యలతో పౌరులకు ఎలాంటి సందేశం ఇస్తున్నారు? మొదటి నుంచి కరోనాను అంచనా వేయటంలో ప్రభుత్వం ఘోరంగా విఫలం అయింది."
-- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
ప్రస్తుత సంక్షోభ సమయంలో కేంద్రానికి మద్దతు ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని, కానీ తమ సూచనలు, సలహాలు తీసుకునేందుకు మోదీ ప్రభుత్వం సుముఖంగా లేదన్నారు రాహుల్.
ఇదీ చదవండి :'కరోనాపై నిమ్మకు నీరెత్తినట్లుగా కేంద్రం'
వ్యాక్సిన్లు ఏవి?
దేశంలో తీవ్రమైన వ్యాక్సిన్ కొరత ఉందన్నారు రాహుల్ గాంధీ. టీకాలు మన దేశంలోనే ఉత్పత్తి అవుతున్నాయని.. మరి మనకే మొదటగా అందించాల్సిన ప్రభుత్వం.. ప్రణాళిక వేయటంలో విఫలం అయిందన్నారు రాహుల్. కరోనా అంతానికి పరిష్కారం వ్యాక్సిన్ తీసుకోవటమే అని స్పష్టం చేశారు.