Woman Marrying Shiva: పార్వతి అవతారంగా పేర్కొంటూ ఓ మహిళ.. పోలీసులకు చుక్కలు చూపించింది. కైలాస మానస సరోవర్ యాత్రకు వెళ్లిన ఆ మహిళ శివుడిని పెళ్లి చేసుకుంటానని చెబుతోంది. అక్కడి నుంచి తిరిగి రానని మొండికేసింది. తనను బలవంతంగా తీసుకెళ్లాలని చూస్తే ఆత్మహత్య చేసుకుంటానని హెచ్చరించింది.
ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూకు చెందిన హమిందర్ సింగ్ అనే మహిళ.. ఇండియా-చైనా సరిహద్దులోని నాభిదంగ్ ప్రాంతానికి వెళ్లింది. అధికారుల నుంచి అనుమతి తీసుకొని 15రోజుల పాటు దర్చులాలోని గుంజి ప్రాంతంలో ఉండేందుకు తన తల్లితో పాటు వెళ్లింది. మానస సరోవర్ యాత్రకు వెళ్లే దారిలో ఈ ప్రాంతం ఉంటుంది. అయితే, మే 25 వరకే వీరు అక్కడ ఉండేందుకు అనుమతి ఉంది. గడువు తేదీ దాటినా.. మహిళ తిరిగి రాలేదు. దీంతో పోలీసుల బృందం మహిళ ఉండే చోటికి వెళ్లింది. వారిని వెళ్లిపోవాలని పోలీసులు అడిగారు. అయితే మహిళ ఇందుకు నిరాకరించింది. ఇక్కడే ఉంటానని చెప్పుకొచ్చింది. తాను పార్వతిదేవి మరో అవతారం అని, బలవంతంగా ఇక్కడి నుంచి పంపిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. దీంతో పోలీసులు వెనకడుగు వేశారు. ఒట్టిచేతులతో వెనుదిరిగారు.