ఝార్ఖండ్‌లో (Jharkhand news) ఓ మహిళ రైల్లోనే బిడ్డకు జన్మనిచ్చింది. స్టేషన్ నుంచి రైలు బయల్దేరిన కొద్దిసేపటికే మహిళ ప్రసవించింది. స్టేషన్‌కు రెండున్నర కిలోమీటర్ల దూరంలో ఆగిన రైలును.. మహిళ కోసం వెనక్కి మళ్లించారు. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు చెప్పారు.
వివరాలు ఇలా..
రాణు దాస్ అనే మహిళ ఒడిశా వెళ్లేందుకు సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ ఎక్కారు. ఎస్5 కోచ్‌లో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్నారు. దిల్లీ నుంచి వచ్చిన ఈ రైలు.. బుధవారం తెల్లవారుజామున 3.55 గంటలకు జంషెద్‌పుర్ సమీపంలోని టాటానగర్ స్టేషన్‌కు (Jharkhand Tatanagar news) చేరుకుంది. 4.10 గంటలకు ప్లాట్‌ఫాం నుంచి బయల్దేరింది. స్టేషన్ దాటిన అనంతరం ఆమెకు పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. దీంతో తన కుటుంబ సభ్యులు చైన్ లాగి రైలును ఆపారు. ఈ క్రమంలో మహిళ రైల్లోనే ప్రసవించింది. రైలు ఆగినట్లు తెలుసుకున్న ఆర్పీఎఫ్ సిబ్బంది.. టాటానగర్ రైల్వే అధికారులకు సమాచారం అందించారు. తర్వాత మహిళ ప్రసవం గురించి వారికి తెలిసింది.