తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Sep 23, 2023, 10:15 PM IST

ETV Bharat / bharat

Woman Constable Gender Change : 'పురుషుడిలా మారిపోతా పర్మిషన్ ఇవ్వండి'.. డీజీపీకి లేడీ కానిస్టేబుల్​ లేఖ

Woman Constable Gender Change : ఓ కానిస్టేబుల్​ తనకు మహిళగా బతకాలని లేదని డీజీపీకి లేఖ రాసింది. పురుషుడిలా లింగమార్పిడి చేయించుకునేందుకు అనుమతించాలని కోరింది. లేకుంటే హైకోర్టుకు వెళ్తానని తేల్చి చెప్పింది. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది.

Woman Constable Gender Change
Woman Constable Gender Change

Woman Constable Gender Change :ఓ మహిళా కానిస్టేబుల్​.. తాను పురుషుడిగా మారేందుకు అనుమతించాలంటూ డీజీపీకి లేఖ రాసింది. అందులో తనకు మహిళగా ఉండటం ఇష్టం లేదని.. చిన్నప్పటి నుంచి పురుషుడిలా బతకాలని అనుకుంటున్నట్లు తెలిపింది. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే కోర్టును ఆశ్రయించడానికి కూడా వెనకాడనంటోంది. లింగమార్పిడి కోసం ఇప్పటికే వైద్యులను కూడా కలిసిందీ పోలీస్​. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లోని గోరఖ్​పుర్​లో జరిగింది.

ఇదీ జరిగింది
అయోధ్యకు చెందిన ఓ మహిళకు 2019లో ఉత్తర్​ప్రదేశ్​ పోలీసు విభాగంలో కానిస్టేబుల్​గా ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం ఆమె గోరఖ్​పుర్​లోని లోకల్​ ఇంటెలిజెన్స్​ యూనిట్- ఎల్​ఐయూలో విధులను నిర్వర్తిస్తోంది. తాజాగా ఈ కానిస్టేబుల్​.. ఉత్తర్​ప్రదేశ్​ డీజీపీకి ఓ లేఖ రాసింది. అందులో తాను చిన్నప్పటి నుంచి జెండర్​ డిస్పోరియాతో బాధపడుతున్నట్లు తెలిపింది. పోలీసు ఉద్యోగంలో చేరాక.. లింగమార్పిడి చేయించుకోవాలని అనిపించిందని చెప్పింది. అయితే​ లింగమార్పిడి చేయించుకునేందుకు ఇప్పటికే దిల్లీలోని పలువురు వైద్యులను సంప్రదించానని.. శస్త్రచికిత్సకు తన శరీరం తట్టుకుంటుందని నిర్ధరించుకున్న తర్వాత ఈ లేఖ రాశానని తెలిపింది.

ఈ విషయంపై స్పందించిన డీజీపీ కార్యాలయం.. గోరఖ్​పుర్ పోలీసులకు ఓ లేఖ రాసిందని సమాచారం. అందులో ఆ మహిళా కానిస్టేబుల్​కు కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆదేశించిందని తెలుస్తోంది. ఆమె ప్రస్తుత మానసిక స్థితి ఎలా ఉందో.. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుందో తెలుసుకోవాలని ఆదేశాలు జారీ చేసిందని సమాచారం. మహిళా కానిస్టేబుల్​ను కూడా తమ కార్యాలయానికి పిలిపించిందని.. అక్కడ ఆమె తనకున్న సమస్యను చెప్పుకుందని తెలిసింది. అయితే ఈ విషయం అధికారికంగా బయటకు రాకున్నా.. పోలీసు వర్గాల్లో మాత్రం చర్చించుకుంటున్నారు.

అయితే, మహిళా కానిస్టేబుల్​.. తనకు చిన్నప్పటి నుంచే అమ్మాయిల దుస్తులు ధరించడం అసౌకర్యంగా అనిపించేందని తెలిపింది. హార్మోన్లలో మార్పులు వచ్చాయని.. మానసికంగా కూడా అలాగే అనిపించేదని చెప్పింది. అయితే ఉద్యోగం వచ్చాక కూడా మగవారిలా జట్టు కత్తిరించుకోవడం, బుల్లెట్​ బైక్​ నడపడం, క్రికెట్​ ఆడటం లాంటివి చేశానని తెలిపింది. తనని తాను మహిళగా అంగీకరించుకోవడానికి సిద్ధంగా లేనని తేల్చి చెప్పింది. లింగమార్పిడిపై ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందిస్తారని ఆశాభావం వ్యక్తం చేసింది. ఒకవేళ అనుమతి నిరాకరిస్తే హైకోర్టుకు వెళ్లడానికి కూడా సిద్ధమని తెలిపింది.

కానిస్టేబుల్​కు ఫుల్​గా​ మద్యం తాగించి 'ఖైదీ' పరార్​.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?

న్యాయం కోసం కోడి పుంజు పోరాటం.. స్టేషన్​ ఎదుట బైఠాయింపు!.. ఏం జరిగింది?

ABOUT THE AUTHOR

...view details