wine sale in Maharashtra: మందు బాబులకు గుడ్ న్యూస్ చెప్పింది మహారాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్రంలోని మద్యం ప్రియులు ఇకపై కిరాణ దుకాణాలు, సూపర్ మార్కెట్లలోనూ వైన్ కొనుగోలు చేయొచ్చు. 1000 చదరపు అడుగులకుపైగా విస్తీర్ణం కలిగిన కిరాణ దుకాణాలు, సూపర్ మార్కెట్లో వైన్ విక్రయాలకు అనుమతిస్తూ.. 'షెల్ఫ్ ఇన్ షాప్' పాలసీకి ఆమోదం తెలిపింది మాహారాష్ట్ర మంత్రివర్గం.
గత 20 ఏళ్ల నుంచి రాష్ట్రంలో అమలులో ఉన్న పాలసీ ప్రకారం.. కేవలం లిక్కర్ స్టోర్లలోనే వైన్ విక్రయాలు జరపాలి. కానీ, ఆ పాలసీకి మార్పులు చేస్తూ తాజా నిర్ణయం తీసుకుంది మహా ప్రభుత్వం.
మంత్రివర్గం సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన మైనారిటీల అభివృద్ధి శాఖ మంత్రి నవాబ్ మాలిక్.. వ్యవసాయ ఉత్పత్తులు, పండ్లకు మంచి ధరలు లభించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. పండ్ల ద్వారా తయారు చేసిన వైన్ విక్రయాలు పెరగటం ద్వారా రైతులకు గరిష్ఠ ధరలు లభిస్తాయన్నారు. అందుకే సూపర్ మార్కెట్లు, కిరాణ దుకాణాల్లో వైన్ విక్రయాలకు అనుమతించినట్లు చెప్పారు. కొత్త పాలసీని భాజపా వ్యతిరేకించటంపై అడగగా.. అసలు భాజపాకు ఆ హక్కే లేదని తిప్పికొట్టారు మాలిక్. హిమాచల్ ప్రదేశ్, గోవా వంటి భాజపా పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పాలసీలే ఉన్నాయని గుర్తు చేశారు.