రెండు దశాబ్దాల సందిగ్ధతకు తెరదించుతూ రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ఇటీవల ప్రకటన చేసిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్.. అందుకు పూర్వ రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నారు. జనవరిలో పార్టీ ప్రారంభిస్తానని ప్రకటించిన రజనీ.. ఈ నెల 31న అందుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తానని ఇప్పటికే తెలిపారు. ఈ నేపథ్యంలోనే రజనీ దీనికి సంబంధించి పలువురితో సంప్రదింపులు జరుపుతున్నారు.
ఇదీ చదవండి:రజనీ రాజకీయానికి సవాళ్ల స్వాగతం
రాజకీయ ప్రవేశం చేయనున్నట్లు రజనీ చేసిన ప్రకటన తమిళనాడులో రాజకీయ పరిణామాలను ఆసక్తికరంగా మార్చేశాయి. పలు చిన్న పార్టీలతో కలిసి పనిచేస్తున్న అన్నాడీఎంకే-డీఎంకే మధ్య తమిళనాడులో ద్విముఖ పోరు సాగుతుండగా.. భాజపా సైతం అక్కడ పాగా వేసే ప్రయత్నాలు చేస్తూ ఉండడం, త్వరలో శశికళ జైలు నుంచి విడుదల కానుండడం నేపథ్యంలో తమిళనాడు రాజకీయాలపై అందరి దృష్టి పడింది. రజనీ సహ నటుడు కమల్‌హాసన్ కూడా మక్కల్ నీది మయ్యం పేరుతో రాజకీయ పార్టీ స్థాపించగా.. ఇన్ని పరిణామాల మధ్య రజనీ రాక తమిళ రాజకీయాలను ఎటు తీసుకువెళ్తుందో అన్న ఆసక్తి నెలకొంది.
రాష్ట్రవ్యాప్త పర్యటనపై వెనక్కి
తమిళనాడును మార్చేస్తానని, మార్పు ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ కాదని ఇటీవల రజనీ వ్యాఖ్యానించారు. ఈ ప్రకటన నేపథ్యంలో రాజకీయాల్లో రజనీ కొత్త ఒరవడికి శ్రీకారం చుడతారని ఆయన అభిమానులు నమ్ముతున్నారు. అవినీతి లేని రాజకీయాలకు బాటలు వేస్తారని అతని అభిమానులు విశ్వసిస్తున్నారు. మరోవైపు రాష్ట్రవ్యాప్త పర్యటన చేయాలని రజనీ భావించినట్లు సమాచారం. కొవిడ్ విజృంభణ నేపథ్యంలో వైద్యుల సూచన మేరకు ఆ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
ఆధ్యాత్మిక పాలన
ఈ నేపథ్యంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనదైన ముద్ర వేసేందుకు రజనీకాంత్ అంతర్గతంగా పనులు ప్రారంభించారు. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినట్లు రజనీకాంత్ సలహాదారు తమిళరువి మణియన్ తెలిపారు. డీఎంకే, అన్నాడీఎంకే లోపాలను ఎత్తి చూపి రాజకీయాలు చేయాలని భావించట్లేదని పేర్కొన్నారు. తమిళనాడు ఎన్నికల్లో విజయం సాధించి ప్రజలకు అవినీతి రహిత, ఆధ్యాత్మిక, లౌకిక పరిపాలనను అందిస్తానని ట్విట్టర్ వేదికగా రజనీకాంత్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు సుపరిపాలనను అందివ్వాలన్న తన పోరాటంలో ప్రాణాలను కోల్పోయినా సంతోషమేనని రజనీ భావోద్వేగ పూరిత వ్యాఖ్యలు చేశారు.
రాజకీయ శూన్యాన్ని పూడుస్తారా?
రజనీకాంత్‌తో కలిసి పని చేసేందుకు పలు పార్టీలు ఇప్పటికే ఆసక్తి చూపిస్తున్నాయి. రజనీ అంగీకరిస్తే ఆయన పార్టీతో పొత్తుకు అన్నాడీఎంకే సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనం. ఈ పరిస్థితుల నేపథ్యంలో రజనీ రాజకీయ వ్యూహం ఎలా ఉంటుందోనన్న దానిపై ఆసక్తి నెలకొంది. మొత్తానికి జయలలిత, కరుణానిధి మరణించాక తమిళనాట ఏర్పడ్డ రాజకీయ శూన్యతను రజనీకాంత్ భర్తీ చేస్తారా లేదా అన్నది భవిష్యత్‌లో తేలాల్సి ఉంది.