జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ ఛైర్మన్ అరుణ్ హల్దార్.. ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడే (Sameer Wankhede news) నివాసానికి వెళ్లడంపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ (Nawab Malik news) స్పందించారు. నకిలీ కుల ధ్రువీకరణ పత్రం విషయంలో వాంఖడేకు క్లీన్ చిట్ ఇచ్చే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ఈ నేపథ్యంలో అరుణ్ హల్దార్పై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు.
ముంబయిలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించిన మాలిక్... వాంఖడే ఇంటికి హల్దార్ వెళ్లడం వల్ల అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు.
"జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ ఛైర్మన్, భాజపా నేత అరుణ్ హల్దార్ నిన్న వాంఖడే ఇంటికి వెళ్లారు. ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఆయన ముందు దర్యాప్తు నిర్వహించి, సవివర నివేదిక అందించాల్సింది. ఈ విషయంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తాం. వాంఖడేకు క్లీన్ చిట్ ఇచ్చేందుకు ఎందుకంత తొందరపడుతున్నారు. ఆరోపణలపై దర్యాప్తు జరగకుండానే ఇదంతా చేయడానికి కారణమేంటి?"