"యువతలో పోరాట స్ఫూర్తి సన్నగిల్లుతోంది. యువత రాజకీయాల్లోకి వస్తేనే దేశం బాగుపడుతుంది". దాదాపు ప్రతి రాజకీయ నాయకుడి ప్రసంగంలో వినిపించే సూక్తి వచనాలివీ.2017 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులను చూసిన వారికి మాత్రం ఈ మాటలు నమ్మశక్యంగా అనిపించవు. ఎందుకంటే మోదీ, అమిత్‌షా తప్ప మరే పేరూ వినిపించని గుజరాత్‌లో.. అప్పట్లో ఓ మూడు పేర్లు బలంగా వినిపించాయి. యావత్ దేశం దృష్టిని ఆకర్షించేలా చేశాయి. వారే.. హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, జిగ్నేశ్ మేవానీ. వేర్వేరు సామాజిక నేపథ్యాలు. వేర్వేరు ఉద్యమ నేపథ్యాల నుంచి వచ్చిన ఈ ముగ్గురూ.. అనూహ్యంగా గత అసెంబ్లీ ఎన్నికలపై తమదైన ముద్ర వేశారు. భాజపా ఏకఛత్రాధిపత్యానికి దాదాపు బ్రేకులు వేశారు. పూర్తిగా విజయాన్నైతే అడ్డుకోలేకపోయినా.. దేశం చూపును తమవైపు చూపు తిప్పుకునేలా చేశారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలుగానూ గెలుపొందారు. అనంతరం వివిధ సందర్భాల్లో అందరూ కాంగ్రెస్ గూటికి చేరారు. ఇప్పుడు మాత్రం జిగ్నేశ్ మినహా మిగిలిన ఇద్దరూ భాజపాలో చేరి ఎన్నికల బరిలో నిలిచారు. కానీ అప్పటికీ ఇప్పటికీ ఒకటే తేడా! అప్పుడు పోరాట యోధులుగా ఉన్న ఆ ముగ్గురూ.. ఇప్పుడు కేవలం ఎన్నికల బరిలో నిలిచిన సాధారణ అభ్యర్థులుగా మారిపోయారు. అంతలా ఆ మూడు పేర్లూ వినిపించకుండా పోయాయి. ఒకవేళ ఈసారి ఎన్నికల్లో గెలిస్తే మరో ఐదేళ్లు ఆ రాష్ట్ర ప్రజలు వారి గురించి మాట్లాడుకుంటారేమో గానీ.. ఓడితే మాత్రం వారి గురించి చర్చించే వారే ఉండరేమో!!
నూనుగు మీసాల వయసులోనే సంచలనం
హార్దిక్ అనగానే ఇప్పుడైతే అందరికీ క్రికెటర్ హార్దిక్ పాండ్యా గుర్తొస్తాడు. అదే 2017 ఎన్నికలకు ముందు మాత్రం హార్దిక్ అంటే పటీదార్ ఆందోళన సమితి (పాస్)కి నేతృత్వం వహించిన హార్దిక్ పటేలే గుర్తొచ్చేవారు. అంతలా దేశం దృష్టిని ఆకర్షించాడీ పటీదార్ ఉద్యమ నేత. పటీదార్లకు రిజర్వేషన్ కోరుతూ 2015లో అహ్మదాబాద్ వీధుల్లో 5 లక్షల మందితో ఉద్యమం జరిగింది. దానికి నేతృత్వం వహించారు హార్దిక్ పటేల్. అప్పటికి హార్దిక్ వయసు 20 ఏళ్లే. హార్దిక్ దెబ్బకు అప్పటి ఆనందీబెన్ పటేల్ ప్రభుత్వం దిగి రావాల్సి వచ్చింది. ఆర్థికంగా వెనుకబడిన తరగతులుగా గుర్తించి పటీదార్లు, బ్రాహ్మణులు, బనియన్లకు 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. రెండు పదుల వయసులో ప్రభుత్వాన్ని కదిలించిన హార్దిక్‌ను తర్వాతి కాలంలో అల్లర్ల కేసులు వేధించాయి. దీంతో రాజకీయ మద్దతు అవసరం అయ్యింది. అలా 2019 లోక్‌సభ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. కేసుల కారణంగా ఆ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. తర్వాతి కాలంలో కాంగ్రెస్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. పలు రాష్ట్రాల ఎన్నికలకు స్టార్ క్యాంపెయినర్‌గానూ వ్యవహరించారు. కారణాలు తెలీనప్పటికీ అనూహ్యంగా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి భాజపాలో చేరారు. దీంతో విరాగమ్ సీటు నుంచి అతడిని ఈసారి భాజపా బరిలో దింపింది. అందుకోసం సిట్టింగ్ ఎమ్మెల్యే తేజశ్రీ పటేల్‌ను సైతం పోటీ నుంచి తప్పించింది. దీంతో ఒకప్పుడు ఏ పార్టీకి వ్యతిరేకంగా పోరాడారో ఇప్పుడు అదే పార్టీ నుంచి ఓ అభ్యర్థిగా బరిలో నిలిచారు హార్దిక్. జస్ట్ ఓ అభ్యర్థిగా!