Rajnikanth Political Reentry: సూపర్‌స్టార్ రజినీకాంత్.. రాజకీయాల్లోకి రీఎంట్రీపై తన అభిప్రాయం ఏమిటనేది మరోసారి తేల్చిచెప్పారు. సోమవారం ఆయన చెన్నైలోని రాజ్‌భవన్‌లో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో సమావేశమయ్యారు. అంతకుముందు రోజే ఆయన దిల్లీకి వెళ్లొచ్చారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కార్యక్రమానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్వహించిన భేటీలో పాల్గొన్నారు.
ఇదే కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడ్ని కూడా తలైవా కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారిద్దరు చర్చించుకున్నారు. దేశ, రాష్ట్రస్థాయి సమకాలీన రాజకీయాలు వారిద్దరి మధ్య ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. అయితే దిల్లీలో టూర్‌ను ముగించుకుని చెన్నైకి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌కు వెళ్లి.. గవర్నర్ ఆర్ఎన్ రవితో రజినీ సమావేశమయ్యారు. సుమారు 45 నిమిషాల పాటు భేటీ సాగింది.
అనంతరం రజినీకాంత్ విలేకరులతో మాట్లాడారు. గవర్నర్‌ను కలుసుకోవడానికి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యం లేదని తేల్చిచెప్పారు. మర్యాదపూరకంగా మాత్రమే కలిశానని వివరించారు. గవర్నర్‌తో ఏఏ అంశాల మీద చర్చించారనే విషయాన్ని వెల్లడించడానికి తలైవా నిరాకరించారు. చెప్పుకోదగ్గ భేటీ కాదన్నారు. రాజకీయాల్లోకి రీఎంట్రీ ఆలోచన తనకు ఏ మాత్రం లేదని చెప్పారు. 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' కార్యక్రమానికి రాజకీయాలతో సంబంధం లేదని మరో ప్రశ్నకు సమాధానమిచ్చారు.