West Bengal municipal polls: అసెంబ్లీ ఎన్నికలు జరిగిన పది నెలల తర్వాత నిర్వహించిన స్థానిక సంస్థల ఎలక్షన్లలో అధికార తృణమూల్ కాంగ్రెస్ అఖండ విజయం సాధించింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పునరావృతం చేస్తూ ప్రత్యర్థులను క్లీన్‌స్వీప్ చేసింది. ఎన్నికలు జరిగిన 108 మున్సిపాలిటీలలో 102 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. 77 అసెంబ్లీ స్థానాలు గెలుచుకొని బంగాల్లో ప్రధాన ప్రతిపక్షంగా అవతరించిన భాజపా.. ఒక్క మున్సిపాలిటీని కూడా దక్కించుకోకుండా చతికిల పడింది. కాంగ్రెస్ సైతం సున్నాకే చాపచుట్టేసింది.
West Bengal municipal poll results:
27మున్సిపాలిటీలలో విపక్షాలు అసలు ఖాతాలే తెరవలేదు. ఈ మున్సిపాలిటీలలోని అన్ని వార్డులను అధికార టీఎంసీనే కైవసం చేసుకుంది. భాజపా నేత సువేందు అధికారి కంచుకోట అయిన కంతి మున్సిపాలిటీని సైతం టీఎంసీ స్వాధీనం చేసుకుంది. గత నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ సువేందు అధికారి కుటుంబమే అధికారం చెలాయిస్తోంది. ఈ ఫలితం.. సువేందుకు గట్టి ఎదురుదెబ్బేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Hamro party West Bengal
భాజపా, కాంగ్రెస్ డీలా పడ్డ వేళ.. ఓ సరికొత్త రాజకీయ పార్టీ అనూహ్య ఫలితాన్ని సాధించింది. కొత్తగా ఏర్పాటైన హమ్రో పార్టీ.. డార్జీలింగ్ మున్సిపాలిటీని దక్కించుకుంది. 'గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్' మాజీ నేత, స్థానిక రెస్టారెంట్ యజమాని అజోయ్ ఎడ్వర్డ్స్ ఈ పార్టీని స్థాపించారు. డార్జీలింగ్లో ఆధిపత్యం సాగించే గూర్ఖా జన్ముక్తి మోర్చా, టీఎంసీ, భాజపాలను ఓడించి.. మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు.