West Bengal MP Nusrat Jahan cheating case : సొంత ఇళ్లు కట్టిస్తామంటూ ప్రజలను మోసం చేశారని తృణముల్ ఎంపీ, నటి నుస్రత్ జహాన్‌పై కేసు నమోదైంది. 429 మంది వద్ద నుంచి ఇల్లు కట్టిస్తామంటూ దాదాపు రూ. 28 కోట్ల మేర మోసం చేశారని ఆరోపించారు బాధితులు. దీనిపై గరియాహట్ పోలీసులను ఆశ్రయించారు బాధితులు. మరోవైపు ఆమెపై అలిపోర్ కోర్టులో సైతం కేసు దాఖలు చేశారు. అయితే, ఈ అంశంపై ఎంపీ నుస్రత్ జహాన్‌ను సంప్రదించగా.. ఆమె స్పందించలేదు. దీనిపై ఉన్నతాధికారులు సైతం మౌనం వహిస్తున్నారు.
ఇదీ జరిగింది..
నుస్రత్ జహాన్ డైరెక్టర్‌గా ఉన్న కంపెనీ తక్కువ ధరకే సొంత ఇల్లు కట్టిస్తామంటూ హామీ ఇచ్చింది. ఉత్తర 24 పరగణాలు జిల్లాలో కేవలం రూ. 5.55 లక్షలకు త్రిపుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ ఇస్తామని చెప్పింది. వీటిని 2018లోగా కొనుగోలుదారులకు అందిస్తామని తెలిపింది. దీంతో దాదాపు 429 మంది సంస్థ చెప్పిన నగదును చెల్లించారు. దాదాపు 5 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ వాటిని అందించలేదు. దీంతో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించారు బాధితులు.