బంగాల్లో మరోసారి బాంబుల కలకలం రేగింది. ఉత్తర 24 పరగణాల జిల్లా పానీహాటీ నియోజకవర్గంలోని భాజపా కార్యాలయంపై ఆదివారం రాత్రి దుండగులు ఐదు బాంబులు విసిరారు. వాటిలో పేలని ఒక బాంబును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత మరో రెండు బాంబులను భాజపా కార్యకర్తల ఇళ్లపైకి విసిరినట్లు సమాచారం.
ఈ దాడులు చేసింది అధికార తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) కార్యకర్తలేనని భాజపా ఆరోపించింది. దీంతో ఆగ్రహించిన భాజపా కార్యకర్తలు.. టీఎంసీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.
"రాష్ట్రాన్ని ఏ విధంగా నడుపుతున్నారు? ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారు. పోలీసుల ఎదుటే భాజపా కార్యకర్తల ఇళ్లపై బాంబులు విసురుతున్నారు. అయినా వారు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు."
-సన్మోయ్ బందోపాధ్యాయ్, పానీహాటీ భాజపా అభ్యర్థి