Wasps Fails Woman Suicide: కేరళలో ఓ మహిళ ఆత్మహత్యయత్నం చేసింది. చనిపోదామని మొబైల్ టవర్ ఎక్కిన మహిళ.. కందిరీగల భయంతో కిందకు దిగేసింది. ఆమెను రక్షించిన అగ్నిమాపక సిబ్బంది.. ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే... అలప్పుజలో ఓ మహిళకు తన భర్తతో వాగ్వాదం జరిగింది. అతడి అధీనంలో ఉన్న తన బిడ్డను తిరిగి ఇవ్వాలని కోరింది. ఇందుకు భర్త నిరాకరించడం వల్ల ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకుంది. దీంతో సోమవారం సాయంత్రం కాయంకుళంలోని బీఎస్ఎన్ఎల్ మొబైల్ టవర్ ఎక్కింది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది మాట్లాడేందుకు ప్రయత్నించినా.. ఆమె వినలేదు.
ఆత్మహత్యను ఆపిన కందిరీగలు.. సెల్‌టవర్ ఎక్కిన మహిళ యూటర్న్!
Wasps Fails Woman Suicide: భర్తపై కోపంతో ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించుకుంది ఆ మహిళ. మొబైల్ టవర్ పైకి కూడా ఎక్కింది. కానీ కందిరీగలు చేసిన పనికి ఆమె ఆత్మహత్యయత్నం విఫలమైంది. ఇంతకీ ఏమైందంటే?
మహిళ టవర్ ఎక్కే క్రమంలో పక్కనే ఉన్న కందిరీగ తుట్ట కదిలింది. కందిరీగలన్నీ ఆమెను చుట్టుముట్టాయి. దీంతో భయాందోళనకు గురైన మహిళ తన ఆత్మహత్యాయత్నాన్ని విరమించుకుంది. కందిరీగలు కరవడం వల్ల కేకలు వేస్తూ టవర్ దిగి కిందకు వచ్చింది. తర్వాత అగ్నిమాపక సిబ్బంది ఏర్పాటు చేసిన రెస్కూ నెట్లోకి దూకింది. కందిరీగల వల్లే మహిళ కిందకు దిగిందని రెస్కూ సిబ్బంది తెలిపారు. కాగా ఆమెను తమిళనాడుకు చెందిన మహిళగా గుర్తించారు. అనంతరం ఆమెను ఆస్పత్రికి తరలించినట్లు కాయంకుళం పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు.
ఇదీ చదవండి:పిల్లల కోసం ప్రత్యేక బెర్త్.. రైల్వే శాఖ సరికొత్త ప్రయోగం!