Vishwakarma Scheme Launch 2023 :విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ పీఎం-విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా యశోభూమిని ఆయన విశ్వకర్మ సోదరులకు అంకితం చేశారు. హస్తకళాకారులు, చేతివృత్తిదారులు తయారు చేసిన ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయడంలో యశోభూమి కీలత పాత్ర పోషించనుందని తెలిపారు. శరీరంలో వెన్నెముక ఎంత అవసరమో, సమాజానికి విశ్వకర్మలు అంతే అవసరమని ఈ సందర్భంగా ప్రధాని మోదీ పేర్కొన్నారు. వారు లేకుంటే దైనందిన జీవితాన్ని ఊహించలేమని వెల్లడించారు. ఈ పథకం కింద 18 విభిన్న రంగాల్లో పనిచేస్తున్న విశ్వకర్మ సోదరులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.
"చేతివృత్తుల వారికి శిక్షణ, సాంకేతికత, పరికరాలు భవిష్యత్‌లో చాలా ముఖ్యమైనవి. విశ్వకర్మ యోజన ద్వారా మీ అందరికీ ప్రభుత్వం శిక్షణ ఇస్తుంది. మీలో చాలా మంది రోజువారీ వేతనంపై ఆధారపడి ఉన్నారు. అందుకే శిక్షణ సమయంలోనూ రోజుకు రూ.500 ప్రభుత్వం అందిస్తుంది. మీరు ఆధునిక పరికరాలు, పనిముట్లను కొనేందుకు రూ.15 వేల వోచర్ కూడా ఇస్తాం. మీరు తయారు చేసిన వస్తువులకు బ్రాండింగ్ కల్పించడంతో పాటు ప్యాకేజింగ్, మార్కెటింగ్ సదుపాయాలను కల్పించేందుకు ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. ఇందుకు ప్రతిఫలంగా మీరంతా జీఎస్టీ రిజిస్టర్ అయిన దుకాణాల్లో మాత్రమే పనిముట్లను కొనాలని సూచిస్తున్నాను"
--నరేంద్ర మోదీ, భారత ప్రధానమంత్రి
రూ.2 లక్షల వరకు లోన్..
Vishwakarma Scheme Benefits : సర్టిఫికెట్, ఐడీ కార్డుల ఆధారంగా విశ్వకర్మ పథకానికి ఆయా వర్గాల నుంచి అర్హులను గుర్తిస్తారు. తొలి విడతలో రుణ సాయంగా 5శాతం రాయితీ వడ్డీతో రూ.లక్ష మంజూరు చేస్తారు. ఆ తర్వాత రెండో విడతలో రూ.2లక్షల రుణం ఇస్తారు. కళాకారులు తమ నైపుణ్యాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవడం, టూల్‌కిట్ ఇన్సెంటివ్, డిజిటల్ లావాదేవీలు, మార్కెటింగ్‌ను ప్రోత్సహించేందుకు వీలుగా ఈ రుణాలు మంజూరు చేస్తారు.
రోజుకు రూ.500తో శిక్షణ..
విశ్వకర్మ యోజన ద్వారా రెండు రకాల స్కిల్లింగ్ కార్యక్రమాలు ఉంటాయి. బేసిక్, అడ్వాన్స్డ్ అనేవి ఉంటాయి. వీటిల్లో శిక్షణ పొందుతున్నప్పుడు లబ్ధిదారులకు రోజుకు రూ.500 స్టైఫండ్ కూడా అందిస్తుంది కేంద్ర ప్రభుత్వం. అలాగే అధునాతన టూల్స్ కొనుగోలు చేసుకునేందుకు కూడా ఆర్థిక సాయం అందిస్తుంది.