లోక్‌సభ టీవీ, రాజ్యసభ టీవీ రెండింటిని కలుపుతూ ఏర్పాటు చేసిన సంసద్ టీవీ ఛానెల్‌ను (Sansad Tv Launch) కేంద్రం ప్రారంభించింది. ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సంయుక్తంగా ఈ ఛానెల్‌ను ప్రారంభించారు.
సంసద్ టీవీని ప్రారంభిస్తున్న ప్రధాని మోదీ " పార్లమెంట్ విధానంలో ఇది మరో కీలక ఘట్టం. భారత్ ప్రజాస్వామ్యనానికి అమ్మ లాంటిది. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన సంసద్ టీవీ ప్రారంభించటం శుభపరిణామమన్నారు మోదీ. ప్రజాస్వామ్యం మనకు రాజ్యాంగ నిర్మాణమే కాదు.. జీవనాధారం కూడా. పార్లమెంట్ కేవలం రాజకీయాలే కాదు.. విధానపరమైన నిర్ణయాల కోసం. గత కొంతకాలంగా సమాజంలో మీడియా పాత్ర పెరుగుతూ వస్తోంది. అందుకే నూతన సాంకేతికతకు అనుగుణంగా మలచుకోవాల్సిన అవసరం ఉంది. సంసాద్ టీవీ.. ఓటీటీ, సోషల్ మీడియా సహా యాప్ రూపంలో కూడా అందుబాటులో ఉంటుంది."
-ప్రధాని నరేంద్ర మోదీ
"చర్చ అన్నది ప్రతి దశలోనూ అవసరం. పార్లమెంటు, శాసనవ్యవస్ధలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుంది. ప్రజల ఆకాంక్షలను తీర్చేలా అర్ధవంతమైన చర్చలు జరపాలి. వాగ్వాదాలతో ప్రజావాణిని అణచివేయకూడదు. సంబంధిత వ్యక్తులంతా దీన్ని అర్ధం చేసుకోవాలి. దేశంలో మీడియా వేగంగా విస్తరిస్తోంది. సోషల్ మీడియా, డిజిటల్ మీడియా వచ్చాక సమాచారం చేరవేయడం మరింత సులువైంది. కానీ.. వార్తలు వేగంగా అందించాలన్న తొందరలో కనీస నైతికతలు కూడా పాటించడం లేదు. దేశంలో ప్రస్తుతం ఫేక్ న్యూస్ ప్రధాన సమస్యగా మారింది. "
-వెంకయ్యనాయుడు, ఉపరాష్ట్రపతి
ఉభయ సభల టీవీ ఛానెళ్లను కలుపుతూ.. సంసద్ టీవీ ఏర్పాటు చేస్తున్నట్లు రాజ్యసభ సచివాలయం ఈ ఏడాది ఫిబ్రవరిలోనే అధికారికంగా ప్రకటించింది. నిజానికి దీనిపై గత ఏడాది జూన్‌లోనే నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.
ఇదీ చూడండి :ఎస్సీఓ సదస్సులో వర్చువల్‌గా మోదీ ప్రసంగం