భారత్‌లో యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్‌మెంట్(యూఎస్‌ఎయిడ్) కొత్త మిషన్ డైరెక్టర్‌గా సీనియర్ విదేశాంగ సేవా సభ్యురాలు వీణా రెడ్డి నియమితులయ్యారు. ఈ బాధ్యతలు చేపట్టేందుకు ఆమె దిల్లీకి చేరుకున్నారు. ఈ మేరకు అమెరికా అంబాసిడర్ అతుల్ కశ్యప్.. గురువారం ప్రకటించారు. భారత్, భూటాన్‌లలో మిషన్ డైరెక్టర్‌గా యూఎస్‌ఎయిడ్ కార్యకలాపాలకు వీణా రెడ్డి నేతృత్వం వహించనున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో వీణాపై ప్రశంసలు కురిపించారు కశ్యప్. అమెరికాలో అన్ని రంగాల్లో భారతీయ అమెరికన్ల విజయాలను ప్రతిబింబిస్తూ.. మరో భారతీయ అమెరికన్ క్లిష్టమైన మిషన్‌కు నాయకత్వం వహించనున్నారని హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడిన వీణా రెడ్డి.. భారత్- అమెరికా బంధం మరింత బలోపేతం అవుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
"శాంతియుత, సుసంపన్న సమాజాన్ని నిర్మించడానికి భారత ప్రభుత్వం, ప్రజలతో యూఎస్‌ఎయిడ్ గత ఏడేళ్లుగా జత కడుతోంది. అదే సమయంలో ఇరు దేశాల భాగస్వామ్యం అభివృద్ధి చెందింది. మన సంబంధాన్ని మరింత బలోపేతం చేయడానికి నేను ఎదురుచూస్తున్నా. ప్రపంచం ఎదుర్కొన్న కొవిడ్‌తో భారత్ ఎక్కువగా ఆర్థిక, ప్రాణ నష్టాన్ని చవిచూసింది. భారత్-అమెరికా భాగస్వామ్యం మరింత బలోపేతం దిశగా సాగుతామని విశ్వాసం ఉంది."
-వీణా రెడ్డి, యూఎస్‌ఎయిడ్ మిషన్ డైరెక్టర్