Reactions of YSRCP leaders in Viveka Murder Case: వివేకానందరెడ్డి హత్య వ్యవహారంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అనుచరగణం నాలుక మడతేస్తున్న తీరు.. ఊసరవెళ్లికే రంగులుమార్చడం నేర్పాలా ఉంది. 2019 మార్చి 14 అర్ధరాత్రి తర్వాత వివేకా హత్యకు గురయ్యారు. మార్చి 15న పులివెందులలో,.. మార్చి 16న హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ బయట ప్రతిపక్ష నేత హోదాలో ఆయన జగన్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ఆయన అనుచరగణం చేస్తున్న ప్రచారాలు.. చూసి నివ్వెరపోవాల్సిన పరిస్థితి. బహుశా ఒకే విషయంలో ఇన్ని మాటలు మార్చటంలో.. ప్రత్యేక రికార్డు ఏదైనా ఉంటే అది ‘జగన్ అండ్ కో’ కే దక్కుతుంది.
నాడు సౌమ్యుడు.. నేడు స్త్రీ లోలుడు.?:వివేకా వ్యక్తిత్వంపై జగన్ అండ్‌కో భిన్నస్వర విన్యాసం! ప్రతిపక్షంలో ఉండగా చిన్నాన్నపై జగన్ చూపిన అభిమానం.. ఇప్పుడు వివేకాహత్యలో వైఎస్ అవినాష్‌రెడ్డి.. ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిల ప్రమేయం గురించి సీబీఐ ప్రస్తావించింది మొదలు.. రివర్స్‌లో జగన్ బృందం వివేకాపై రోజులో రకం బురదచల్లుతోంది. అక్రమ సంబంధాలున్నాయని.. సెటిల్‌మెంట్లకు పాల్పడ్డారనే ప్రచారం చేస్తోంది.
పులివెందుల అసెంబ్లీ స్థానానికి వైఎస్ విజయమ్మపై కాంగ్రెస్ అభ్యర్థిగా వివేకా పోటీ చేసినప్పుడు కూడా ఆయన వ్యక్తిత్వంపై.. ఇలా బురద చల్లలేదు. పైగా వివేకాకు.. ఓ ముస్లిం యువతితో సంబంధం ఉందని, 2011లో ఆమెను పెళ్లి చేసుకుని..షేక్ మహ్మద్ అక్బర్‌గా పేరు మార్చుకున్నారని.. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డి ప్రకటించడం నివ్వెరపరుస్తోంది. ముస్లిం మహిళ ద్వారా పుట్టిన అబ్బాయిని రాజకీయ వారసుడిగా ప్రకటించాలని వివేకా అనుకుంటే.. మొదటి భార్య సౌభాగమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి ఒప్పుకోలేదేదని, అందుకే మనస్పర్థలంటూ.. అవినాష్‌రెడ్డి చెప్పుకొస్తున్నారు.
జగన్ కుటుంబ పత్రిక సాక్షిలోనూ అవే ఆరోపణలను.. పతాక శీర్షికల్లో అచ్చేస్తున్నారు. చిన్నాన్న సౌమ్యుడంటూ.. నాడు కీర్తించిన జగన్.. ఇప్పుడు సొంతపార్టీ నేతలు, కుటుంబ సభ్యులే కించపరిచేలా.. మాట్లాడుతుంటే ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలియదు. ఆ ప్రచారాలకు.. తన సొంత పత్రిక సాక్షిలో.. ఎందుకు విస్తృత ప్రచారం కల్పిస్తున్నారనే ప్రశ్నలకు సమాధానం ఉండదు.