Vaccination in india: కరోనా కట్టడిలో భాగంగా దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం నాటికి మొత్తం 127.66కోట్ల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. శనివారం ఒక్క రోజే కోటి డోసులు ఇచ్చామని ప్రకటించింది. ఒక్క రోజులో కోటి వ్యాక్సిన్లు పంపిణీ చేయడం ఇది ఆరోసారి అని పేర్కొంది.
Vaccination records india: ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. ఇప్పటి వరకు 47.59కోట్ల మంది రెండు డోసులూ పూర్తి చేసుకున్నారు. దేశ వయోజనుల జనాభాలో 50శాతం మందికిపైగా రెండు డోసుల టీకాలు తీసుకున్నారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు.
"అర్హత గల వారిలో 50శాతానికిపైగా వయోజనులు రెండు డోసులు తీసుకోవడం గొప్ప విషయం. మరో మైలురాయిని చేరుకున్నందుకు భారతదేశానికి అభినందనలు. కరోనా మహమ్మారిపై పోరులో మనమంతా కలిసే విజయం సాధిస్తాం"
-మన్‌సుఖ్ మాండవీయా, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి.
ఈ ఏడాది జనవరిలో దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. మొదట్లో కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు ప్రాధాన్యతనిచ్చి వ్యాక్సినేషన్ చేపట్టారు. ఆ తర్వాత క్రమంగా ప్రజలందరికీ వ్యాక్సిన్ వేయడం మొదలైంది. అక్టోబర్ నెలలో భారత్.. 100కోట్ల వ్యాక్సినేషన్ మైలు రాయిని చేరుకుంది. భారతీయులందరికీ వ్యాక్సిన్ అందేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి.