Uttarakhand Farmer 24KG Turmeric: సాధారణంగా ఒక మొక్కకు అత్యధికంగా కేజీ పసుపు ఉత్పత్తి అవుతుంది. కానీ ఉత్తరాఖండ్ హల్ద్వానీ జిల్లా గౌలాపార్ గ్రామానికి చెందిన రైతు నరేంద్ర మెహ్రా మాత్రం పసుపు సాగులో నూతన అధ్యాయాన్ని ఆవిష్కరించారు. ఒక్క మొక్క నుంచి ఏకంగా 24కిలోల పసుపును దిగుబడి చేసి చరిత్ర సృష్టించారు. దీని కోసం ఓ కొత్త వంగడాన్ని కనిపెట్టారు నరేంద్ర మెహ్రా.
రింగ్ పిట్ పద్ధతిలో..
రెండేళ్ల క్రితం ఈ ప్రత్యేక వంగడానికి చెందిన పసుపు మొక్కను రింగ్ పిట్ పద్ధతిలో తోటలో నాటారు. రింగ్ పిట్ పద్ధతిలో పసుపు పంటసాగును సాగు చేయడానికి పొలం మొత్తం దున్నాల్సిన పనిలేదు. ఓ గుంత తీసి అందులో పసుపు మొక్కలను నాటితే సరిపోతుంది. తర్వాత సేంద్రీయ ఎరువులను వాడాలి.
"రింగ్ పిట్ అనే పద్ధతిలో ఇది సాధ్యమైంది. పూర్తిగా సేంద్రీయ ఎరువులతో సాగు చేశాను. ఈ దుంప 24కిలోలు ఉంది. ఈ వంగడానికి పేటెంట్ పొందేందుకు ప్రయత్నిస్తున్నా. నా జీవితంలో ఇలాంటి ఉత్పత్తి చూడలేదు, వినలేదు."