ప్రధానమంత్రి నరేంద్రమోదీ(PM Modi) అమెరికా పర్యటన ఖరారైంది. వచ్చేవారం ఆయన రెండు రోజుల పాటు అగ్రరాజ్యంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆ దేశాధ్యక్షుడు జో బైడెన్ ఆతిథ్యంలో జరగనున్న క్వాడ్ నేతల సదస్సులో(Quad Summit 2021) మోదీ పాల్గొననున్నారు. దీంతో పాటు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలోనూ(UNGA 2021) ప్రసంగించనున్నట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంగళవారం వెల్లడించింది.
సెప్టెంబరు 24న వాషింగ్టన్‌లో మోదీ, బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్, జపాన్ ప్రధాని యోషిహిడే సుగా మధ్య క్వాడ్ సదస్సు జరగనుందని విదేశాంగశాఖ తమ ప్రకటనలో పేర్కొంది. ఆ తర్వాత సెప్టెంబరు 25న న్యూయార్క్ వేదికగా ఐరాస సర్వసభ్య సమావేశం 76వ సెషన్‌లో జరిగే 'జనరల్ డిబేట్'లో ప్రధాని పాల్గొని కీలక ప్రసంగం చేయనున్నట్లు తెలిపింది. ఈ సమావేశంలో బైడెన్, మోదీ సహా వివిధ దేశాలకు చెందిన 100 మంది నాయకులు నేరుగా పాల్గొని ప్రసంగించనున్నారు.
దాదాపు ఆరు నెలల తర్వాత మోదీ(Modi News) వెళ్తోన్న తొలి విదేశీ పర్యటన ఇదే. అంతేగాక, క్వాడ్ దేశాధినేతలు ముఖాముఖీగా సదస్సులో పాల్గొనడం కూడా ఇదే తొలిసారి. ఈ ఏడాది మార్చిలో క్వాడ్ నేతల మధ్య తొలి సదస్సు జరిగినప్పటికీ కరోనా కారణంగా ఈ నలుగురు నేతలు వర్చువల్‌గా సమావేశమయ్యారు. ఆ భేటీలోనే క్వాడ్ వ్యాక్సిన్ ఇనిషియేటివ్‌కు శ్రీకారం చుట్టగా.. భారత్ కూడా పలు దేశాలకు టీకాలను ఎగుమతి చేసింది. అయితే ఆ తర్వాత మన దేశంలో రెండో దశ రావడంతో ఆ కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.