uptet cancelled news: యూపీలో ఆదివారం జరగాల్సిన టెట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ (UP TET paper leak) అయింది. దీంతో అభ్యర్థులు సెంటర్లకు వెళ్లిన తర్వాత పరీక్షను రద్దు చేసింది ప్రభుత్వం.
లీక్‌కు కారకులైన దాదాపు 23 మందిని అరెస్టు చేసినట్లు ప్రత్యేక కార్యాచరణ దళం (ఎస్టీఎఫ్) తెలిపింది. నిందితుల్లో కొందరు యూపీకి చెందినవారు కాగా.. మరికొందరు బిహార్‌కు చెందినవారు ఉన్నారని వెల్లడించింది. వారి నుంచి ప్రశ్నాపత్రాల ఫొటోలు, మొబైల్ ఫొన్స్ను స్వాధీనం చేసుకున్నట్లు స్పష్టం చేసింది.
"నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న ప్రశ్నాపత్రం.. పరీక్షలో వచ్చిన పేపర్ రెండూ ఒకటేనని తెలిసిన వెంటనే విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో పరీక్షను వెంటనే రద్దు చేశాము. వచ్చే నెలలో మరల పరీక్షలను నిర్వహిస్తాము. అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేసుకోనవసరం లేదు. సెంటర్ల వద్ద ఉన్న అభ్యర్థుల తిరుగు ప్రయాణానికి ఉచిత బస్సు సౌకర్యం కల్పించాము. హాల్‌టికెట్ చూపించి బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు."
-ప్రశాంత్ కుమార్, శాంతి భద్రతల అదనపు డైరెక్టర్ జనరల్
టెట్ పరీక్షకు (up tet news) దాదాపు 20 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యారు. ప్రభుత్వ అనూహ్య నిర్ణయంతో వారంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు వెచ్చించి ఎంతో దూరం నుంచి పరీక్షకు హాజరయ్యామని, తమ శ్రమంతా వృథా అయిందని కొందరు అభ్యర్థులు కన్నీళ్లు పెట్టుకున్నారు.