ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది గాయపడ్డారు. బారాబంకీ జిల్లాలో పూర్వాంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై ఈ దుర్ఘటన జరిగింది.
సోమవారం ఉదయం నరేంద్రపుర్ మద్రాహ గ్రామానికి సమీపంలో ఎక్స్‌ప్రెస్ వేపై ఓ డబుల్ డెక్కర్ బస్సు ఆగి ఉంది. అదే సమయంలో బిహార్‌లోని సీతామఢీ నుంచి దిల్లీ వెళ్తున్న మరో డబుల్ డెక్కర్ బస్సు.. వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
రెండు డబుల్ డెక్కర్ బస్సులు ఢీ- 8 మంది మృతి
ఎక్స్‌ప్రెస్ వేపై ఆగి ఉన్న డబుల్ డెక్కర్ బస్సును మరో డబుల్ డెక్కర్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో 8 మంది మరణించారు. 16 మంది గాయపడ్డారు. ఉత్తర్‌ప్రదేశ్ బారాబంకీలో పూర్వంచల్ ఎక్స్‌ప్రెస్ వేపై జరిగిందీ దుర్ఘటన.
సమాచారం అందిన వెంటనే పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రుల్ని స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. గాయపడ్డ వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ మరణించారు. తీవ్రంగా గాయపడ్డ వారిని లఖ్‌నవూలోని ట్రామా కేంద్రానికి తరలిస్తున్నట్లు బారాబంకీ అదనపు ఎస్పీ మనోజ్ పాండే వెల్లడించారు.
ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు.
జమ్ముకశ్మీర్‌లో ఆరుగురు
జమ్ముకశ్మీర్ రాంబాన్ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య ఆరుకు చేరింది. గాయపడ్డ వారిలో ఇద్దరు చికిత్స పొందుతూ శ్రీనగర్‌లోని ఆస్పత్రిలో సోమవారం ప్రాణాలు విడిచారు.
రాంబాన్ జిల్లా రామ్సూ ప్రాంతంలో ఆదివారం ఈ ప్రమాదం జరిగింది. బాధితులు ప్రయాణిస్తున్న ఎస్యూవీ.. అదుపు తప్పి 1000 అడుగుల లోయలో పడిపోయింది. నలుగురు అక్కడికక్కడే మరణించారు. గాయపడ్డ మరో నలుగుర్ని ఆస్పత్రిలో చేర్చగా.. సోమవారం ఇద్దరు చనిపోయారు. మిగిలిన ఇద్దరికీ వైద్యులు చికిత్స అందిస్తున్నారు.