ప్రైవేటు ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా అందడం లేదని యూపీకి చెందిన భాజపా ఎంపీ కౌశల్ కిశోర్ ఆరోపించారు. కరోనా బాధితులు అవస్థలు పడుతున్నారని, మరికొందరు చనిపోతున్నారని పేర్కొన్నారు. మోహన్‌లాల్ గంజ్ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన.. ఈ మేరకు ఓ వీడియోను విడుదల చేశారు.
"ఆక్సిజన్ సిలిండర్లను సరఫరా చేసే రెండు సంస్థల యజమానులతో నేను మాట్లాడాను. తమపై డ్రగ్ ఇన్స్పెక్టర్లు ఒత్తిడి పెంచుతున్నారని వారు చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రులకు ఆక్సిజన్ సరఫరా చేయొద్దని ఆదేశించినట్లు తెలిపారు. ఎవరు చనిపోయినా సరే.. ప్రభుత్వ ఆస్పత్రులకు మాత్రమే ఆక్సిజన్ పంపాలని వారు స్పష్టం చేసినట్లు యజమానులు నాతో చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా.. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. కొందరు చనిపోతున్నారు కూడా. ఆక్సిజన్ లేదని చాలా మంది రోగులను వైద్యులు వెనక్కి పంపిస్తున్నారు."