Unviable Populist Schemes: దేశంలోని కొన్ని రాష్ట్రాలు ఆర్థికపరమైన క్రమశిక్షణ పాటించడం లేదని, ప్రజాకర్షక పథకాలతో ప్రజలను మోసపుచ్చుతున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశంలో సీనియర్ అధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. ఆర్థిక పరిస్థితి ఘోరంగా ఉన్నా.. అప్పులు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయని, ఈ ప్రభావం దీర్ఘకాలంలో ఆ రాష్ట్రాలపై తీవ్రంగా పడే అవకాశం ఉందన్నారు. ఇలాగే కొనసాగితే శ్రీలంకతరహా ఆర్థిక సంక్షోభం ఆ రాష్ట్రాల్లో తలెత్తడం తథ్యమని హెచ్చరించారు. శనివారం రాత్రి మోదీ.. తన క్యాంప్ కార్యాలయంలో నాలుగు గంటల పాటు.. వివిధ విభాగాల కార్యదర్శులతో భేటీ అయ్యారు. పలు పాలనాపరమైన విషయాలపై చర్చించారు. సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ డోభాల్, ప్రధాని ముఖ్య కార్యదర్శి పి.కె.మిశ్ర, కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబాతో పాటు కేంద్ర ప్రభుత్వంలోని కీలక అధికారులంతా పాల్గొన్నారు.
ఉచిత పథకాలతో దేశంలో శ్రీలంక తరహా సంక్షోభం - ఉచిత పథకాలతో దేశంలో సంక్షోభం
Unviable Populist Schemes: రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తున్న ప్రజాకర్షక పథకాల వల్ల దేశం శ్రీలంక సంక్షోభం వైపు ప్రయాణించేలా ఉందని ప్రధాని మోదీ ముందు సీనియర్ బ్యూరోకాట్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పథకాలు ఆర్థిక అస్థిరతకు కారణమవుతున్నాయని, దీనివల్ల భారత్ కూడా శ్రీలంక లాంటి ఆర్థిక సంక్షోభంలో చిక్కుకునే అవకాశం ఉందని మోదీ దృష్టికి తీసుకెళ్లారు.
![ఉచిత పథకాలతో దేశంలో శ్రీలంక తరహా సంక్షోభం Unviable Populist Schemes](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14920330-thumbnail-3x2-img.jpg)
ఈ సందర్భంగా ప్రధాని.. అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అభివృద్ధి కుంటుపడటానికి పేదరికాన్ని సాకుగా చూపుతూ చెప్పే పాత కథలను అధికారులు మానుకోవాలని హితవు పలికారు. భారీ అభివృద్థి పథకాలను అలక్ష్యం చేయొద్దని స్పష్టం చేశారు. అధికారుల సూచనలనూ మోదీ సావధానంగా విన్నారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యదర్శులతో ప్రధాని సమావేశమవ్వడం ఇది తొమ్మిదో సారి. సమావేశంలో ఇద్దరు కార్యదర్శులు కొన్ని రాష్ట్రాలు వ్యవహరిస్తున్న తీరును మోదీ దృష్టికి తీసుకొచ్చారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో.. ఆర్థికంగా కుదేలైన ఓ రాష్ట్రంలో ప్రకటించిన ప్రజాకర్షక పథకాలను వారు ప్రస్తావించారు. ఈ మార్గాన్నే మరికొన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని, ఆర్థికంగా అమలు చేయడం కష్టమని తెలిసినా.. ప్రజలను మోసపుచ్చుతున్నాయని అన్నారు. ఈ బాటలో కొనసాగితే ఆ రాష్ట్రాల్లో శ్రీలంక తరహా ఆర్థిక సంక్షోభం తలెత్తేప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఇదీ చదవండి:'సీబీఐ ఇప్పుడు పంజరంలో చిలుక కాదు'