రాజస్థాన్ ఉదయ్పుర్లో ఓ వ్యక్తి ఫిఫా ప్రపంచ కప్ కోసం సరికొత్త ఆలోచనతో ముందుకొచ్చాడు. ఇక్బాల్ నక్కా అనే వ్యక్తి బంగారంతో.. ప్రపంచంలోనే అతిచిన్న వరల్డ్ కప్ ప్రతిరూపాన్ని తయారు చేసి అరుదైన రికార్డు సాధించారు. ఆయన ఇంతకముందు కూడా తన నైపుణ్యంతో అతి చిన్న బంగారు ఆభరణాలను తయారు చేసి 100 రికార్డులను సృష్టించారు. అయితే ఈసారి ఆయన ఒక మిల్లీమీటర్ల పరిమాణంలో ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీని తయారుచేసి మరో అరుదైన రికార్డును ఆయన ఖాతాలో వేసుకున్నారు.
బంగారంతో బుల్లి ఫిఫా వరల్డ్ కప్ ట్రోఫీ.. సూది బెజ్జంలో పట్టేంత సైజులో..
ప్రస్తుతం ప్రపంచం దృష్టంతా ఖతార్ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ పైనే ఉంది. దీంతో రాజస్థాన్‌లో ఓ వ్యక్తి వినూత్న ఆలోచనతో ముందుకొచ్చాడు. ప్రపంచంలోనే అతిచిన్న ఫిఫా వరల్డ్ కప్ రూపొందించాడు. ఇది ఎంత చిన్నదంటే.. లెన్స్‌తో చూస్తేనే స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకుందామా..
"ఫిఫా వరల్డ్ కప్‌లో భారత్ జట్టు పాల్గొనకపోయినా, భారత్‌తోపాటు మిగతా దేశాల దృష్టంతా దానిపైనే ఉంది. అయితే ఈ ఫిఫా వరల్డ్ కప్‌లో ఏ జట్టు గెలిచినా నేను తయారు చేసిన ఈ ట్రోఫీని అందజేయాలని అనుకుంటున్నాను. ఈ మేరకు భారత్ ప్రధాని నరేంద్రమోదీకి కూడా లేఖ రాశాను. నేను రూపొందించిన ట్రోఫీ పరిమాణం ఒక మిల్లీమీటర్. దీన్ని బంగారంతో తయారు చేశాను. ఈ ట్రోఫీ చాలా చిన్నది. దీన్ని లెన్స్ సహాయంతో చూడవచ్చు. బంగారంతో తయారు చేసిన ప్రపంచంలోనే అతి చిన్న ఈ ట్రోఫీ కేవలం ఒక మిల్లీమీటర్ మాత్రమే. ఇది ఖచ్చితంగా నిజమైన టోఫీ లాగా కనిపిస్తుంది. టోఫీతో పాటు, మైక్రోస్కోప్ లెన్స్‌తో మాత్రమే చూడగలిగే ఫుట్‌బాల్‌ను కూడా నేను తయారు చేశాను. దీని పరిమాణం 0.01 మిల్లీమీటర్లు. ఇది సూది రంధ్రం గుండా సులభంగా వెళుతుంది. ఇది తయారు చేయడం అంత సులభం కాదు. దీన్ని తయారు చేసేందుకు నాకు 2 నుంచి 3 రోజులు పట్టింది. చిన్నగా ఉండడం వల్ల దీని తయారీలో చాలా సమస్యలు ఎదురయ్యాయి."
-ఇక్బాల్ నక్కా, ప్రపంచంలోనే అతిచిన్న ఫిఫా వరల్డ్ కప్ రూపకర్త